సాక్షి, యాదాద్రి : ప్రజా భద్రత కోసం పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఐజీ జోయెల్ డేవిస్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ శాఖ పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, దొంగతనాల నివారణ, సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తు వేగవంతం చేయడం వంటి అంశాలపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భద్రతా ఏర్పాట్లను, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. జిల్లాలో జరిగే వీఐపీ పర్యటనలు, ముఖ్య కార్యక్రమాల బందోబస్తు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులపై ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, నేరాల గుర్తింపు, వాహనాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్మార్ట్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును సత్వరమే పూర్తి చేసి, నేరస్థులకు శిక్షలు పడే శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఉన్న సీసీటీవీ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. భరోసా కేంద్రం పనితీరును, బాధితులకు అందుతున్న సేవలను మరింత విస్తృతం చేయాలని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసి, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని పెంపొందించేలా పని చేయాలని డీఐజీ జోఝెల్ డేవిస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీలు లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఐజీ జోయెల్ డేవిస్


