పెద్దవూర : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం తెప్పలమడుగు గ్రామ స్టేజీ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన చెవుల నగేష్(32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పెద్దవూర మండల కేంద్రంలో జరిగిన ఫంక్షన్‌కు బైక్‌పై వచ్చి రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో తెప్పలమడుగు గ్రామ స్టేజీ సమీపంలోని అమ్మ రైస్ మిల్లు వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిప్పాడు. దీంతో బైక్‌ను లారీ ఢీకొనడంతో నగేష్ రోడ్డుపై పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న పెద్దగూడెం గ్రామానికే చెందిన నవీన్ గమనించి గాయపడిన నగేష్‌ను 108 అంబులెన్స్‌లో నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు.


