పెద్దవూర : విత్తనం బాగుంటే మొలక బాగా వస్తుంది. మొలకలు బాగా వస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అందుకే రైతులు పంటల సాగులో నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఎన్. సత్యనారాయణ సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను క్రమపద్ధతిలో కడితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వివరించారు. విత్తనాలను మొలక కట్టి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చునని వివరిస్తున్నారు.
విత్తనం ఎంపిక
పంట సాగులో విత్తన నాణ్యతను మొలక శాతం ఆధారంగా నిర్ధారిస్తారు. అందుకు తెలుగు రాష్ట్రాలలో విత్తన పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి విత్తనాలను ఎంపిక చేస్తారు. ఆ విత్తనాలను ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు నిర్ధారించి రైతులకు సరఫరా చేస్తారు. రైతులు తాము పండించిన పంట నుంచి కూడా విత్తనాలు తయారు చేసుకోవచ్చు. విత్తనాలను మొలక కట్టి వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.
పేపర్ టవల్ పద్ధతి
పేపర్ టవల్ లేదా మందపాటి బట్టను తీసుకుని బాగా తడిపి గచ్చు నేలపై పరిచి 100 గింజలను వరుసలో అమర్చాలి. దీనిపై మరో తడి పేపర్‌పై టవల్‌ను పరిచి రెండింటిని కలిపి చాపలా చుట్టాలి. చివర్లో దారంతో చుట్టి ఏదైనా పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా వరి, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలను పరీక్షించుకోవచ్చు.
ట్రే పద్ధతి
లావు గింజ రకాలైన పత్తి, వేరుశనగ, ఆముదం వంటి విత్తనాలను ఇసుక పోసిన ప్లాస్టిక్ ట్రేలో వేయాలి. 100 విత్తనాలను అంగుళం లోతు ఇసుకలో విత్తుకోవాలి. తేమ ఉండేటట్లు నీళ్లు చల్లుతూ ఉండాలి.
పెట్రి డిష్ పద్ధతి
ఈ పద్దతిలో వంగ, టమాట, మిరప వంటి చిన్న విత్తనం మొలకలను పరీక్షించుకోవచ్చు. పెట్రిడిష్‌లో బ్లాటింగ్ పేపరును ఆమర్చి నీటితో తడపాలి.
గుడ్డమూట పద్ధతి
మొలక కట్టాల్సిన 100 విత్తనాలను గుడ్డలో మూతకట్టి దీనిని చిన్న ప్లేటులో పెట్టి అప్పుడప్పుడు తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతి ద్వారా 5 నుంచి 10 రోజుల్లో మొలక శాతాన్ని తెలుసుకోవచ్చు.
మొలక శాతం ఇలా..
u సామాన్యంగా పరీక్షకు తీసిన శాంపిల్ గింజల్లో నూటికి 99 శాతం మంచి గింజలు ఉండాలి.
u మొక్కజొన్నకు 90 శాతం, పప్పు దినుసులకు 75 నుంచి 80 శాతం, నూనె గింజలకు 70 నుంచి 80శాతం, పత్తి, బెండ విత్తనాలకు 65శాతం, ఇతర ధాన్యాలకు 75 నుంచి 80శాతం మొలకలు రావాలి.
ఉపయోగాలు
u రైతులు పైన పేర్కొన్న నాలుగు పద్ధతులలో తమ స్థాయిలో మొలక శాతాన్ని పరీక్షించుకోవాలి.
u మొలక శాతం పరీక్షల అనంతరం పంట పెంచుకోవడం వలన సమయం
వృథా కాదు.
u విత్తనాల విషయంలో ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడవచ్చు.
u నాణ్యమైన విత్తనాలను నాటితే
అధిక దిగుబడులు పొందవచ్చు.
పెద్దవూర మండల వ్యవసాయాధికారి
సత్యనారాయణ సూచనలు


