చౌటుప్పల్ : అక్రమంగా పశువులను తరలిస్తున్న వాహనాన్ని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన షేక్ యాకూబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడు కోదాడ సంతలో 5 ఆవులు, 4 ఎద్దులను కొనుగోలు చేసి వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. వలిగొండ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ద్విచక్ర వాహనం చోరీ
తిప్పర్తి : మీసేవ కేంద్రం ఎదుట పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంంలో అటెండర్‌గా పనిచేస్తున్న నిరంజన్ జిరాక్స్ తీసుకురావడానికి స్థానికంగా ఉన్న ఓ మీసేవ కేంద్రానికి బైక్‌పై వెళ్లాడు. బైక్ పార్కింగ్ చేసి జిరాక్స్ తీసుకొని వచ్చే లోపే గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌ను చోరీ చేశారు. దీంతో బాధితుడు తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
విద్యుదాఘాతంతో
వడ్రంగి మృతి
గుండాల : ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వడ్రంగి మృతిచెందాడు. ఈ ఘటన గుండాల మండలం తుర్కలశాపురం గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కలశాపురం గ్రామానికి చెందిన పోలోజు సత్యనారాయణ (60) వృత్తి రీత్యా వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజుమాదిరిగా సోమవారం తన ఇంటి బయట లైట్ కోసం ప్లగ్‌లో విద్యుత్ తీగలను అమరుస్తుండగా వైరు జారి మీదపడటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్యనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
చౌటుప్పల్ : పాముకాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లింగాపూర్‌తండాకు చెందిన ధీరావత్ స్వామి(34) తన తండ్రి బిచ్చుతో కలిసి సెంట్రింగ్ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులోని ఓ బయోటెక్ కంపెనీలో సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. రోజుమాదిరిగానే ఈ నెల 11న సైతం తండ్రితో కలిసి ఉదయం 9గంటలకు పనికి వెళ్లాడు. కంపెనీలో పని ముగించుకొని రాత్రి 7గంటల ప్రాంతంలో జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ కొయ్యలగూడెం బస్టాప్‌కు వెళ్తుండగా.. స్వామి ఎడమ కాలుకు పాము కాటు వేసింది. అతడి తండ్రి గుర్తించి ఆటోలో స్వామిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.


