భవనంపై నుంచి దూకి వివాహిత బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

భవనంపై నుంచి దూకి వివాహిత బలవన్మరణం

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

భూదాన్‌పోచంపల్లి : భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధల వల్ల మనస్తాపం చెందిన భార్య రెండంతస్తుల భవనంపై నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం భూదాన్‌పోచంపల్లి పట్టణంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన మనీష్‌, రాణిదేవి (28) దంపతులు వ్యాపార నిమిత్తం నాలుగేళ్ల క్రితం పోచంపల్లికి వలస వచ్చారు. అద్దె ఇంట్లో ఉంటూ చౌటుప్పల్‌ చౌరస్తాలోని మెయిన్‌ రోడ్డుపై భవానీ జ్యువెల్లరీ షాపు, భవానీ క్లాత్‌ షోరూం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండున్నర సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంట్లో గిన్నెలు కడిగే విషయమై భార్యాభర్తలు గొడవ పడ్డారు. సోమవారం ఉదయం యథావిధిగా రాణిదేవి నిద్ర లేచి వంట చేసింది. భార్యాభర్తలిద్దరూ షాపుల వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు రాణిదేవి ఇంటికి వచ్చింది. అనంతరం మధురైలో ఉంటున్న తమ్ముడు మహేందర్‌కు వాట్సాప్‌లో తనకు బతకాలని లేదని చనిపోతున్నానని వాయిస్‌ మేసేజ్‌ పెట్టింది. వెంటనే ఆందోళన చెందిన అతడు బావ మనీష్‌కు ఫోన్‌ చేసి వెంటనే ఇంటికి వెళ్లమని చెప్పాడు. మనీష్‌ ఇంటికి వెళ్లేసరికి రాణిదేవి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాణిదేవి మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement