ఆలేరు : ఆటో అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టి రోడ్డు పక్కన మక్కబుట్టలు విక్రయిస్తున్న మహిళ పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. ఆలేరు ఎస్‌ఐ వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికల్ అండర్‌పాస్ దాటిన తర్వాత వరంగల్–హైదరాబాద్ బైపాస్ మార్గంలో భువనగిరి వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం బైపాస్ పక్కన మక్కబుట్టలు విక్రయిస్తున్న ఎల్లమ్మ అనే మహిళను కూడా ఢీకొని ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మక్కబుట్టలు విక్రయించే మహిళ తలకు తీవ్రంగా గాయమైంది. ఆటో డ్రైవర్ మహేందర్, బైక్‌పై వెళ్తున్న శ్రీశైలం, జహంగీర్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎల్ల మ్మను మెరుగైన వైద్యం కోసం జనగామ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు పక్కన మహిళ పైకి దూసుకెళ్లి బోల్తా
ఆరుగురికి గాయాలు


