180 చెక్‌బౌన్స్‌ కేసుల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

180 చెక్‌బౌన్స్‌ కేసుల గుర్తింపు

Jul 8 2026 2:02 AM | Updated on Jul 8 2026 2:02 AM

భువనగిరిటౌన్‌ : జిల్లా వ్యాప్తంగా 976 చెక్‌ బౌన్స్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో మొదటి విడతగా దాదాపు 180 కేసులను పరిష్కారం కోసం గుర్తించినట్లు నిమిత్తం గుర్తించామని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు, సంస్థ కార్యదర్శి వి. మాధవీ లత మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. చెక్‌ బౌన్స్‌ కేసుల పరిష్కారానికి ఈనెల 18న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకేసులకు సంబంధించిన కక్షిదారులకు ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. కక్షిదారులకు అవసరమైన తగిన న్యాయ సహాయం, సేవలు అందించేందుకు భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌, యాదాద్రి కోర్టులలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, ఇదే తరహాలో రెండవ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను తిరిగి ఈ ఏడాది నవంబర్‌ 21వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు.

శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం

ఆత్మకూరు(ఎం): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమని ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎం) పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. రికార్టులు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నేర పరిశోధనలో పోలీస్‌లు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ ఎన్‌. లక్ష్మీనారాయణతో పాటు పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

డిప్యూటీ ఈఓ నవీన్‌ బదిలీ..?

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహిస్తున్న నవీన్‌ కుమార్‌ వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి బదిలీ అయినట్లు సమాచారం. ఆయన స్థానంలో గతంలో యాదగిరి క్షేత్రంలో డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహించిన దోర్భాల భాస్కర్‌ శర్మ తిరిగి రానున్నట్లు ఆలయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. ఈ ఏడాది మార్చి 30వ తేదీన వేములవాడ శ్రీరాజరాజేశ్వరి దేవస్థానానికి వర్కింగ్‌ అరేంజ్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ ఈఓ హోదాలో దోర్భాల భాస్కరశర్మ బదిలీపై వెళ్లారు. నాలుగు నెలల తరువాత డిప్యూటీ ఈఓ నవీన్‌ కుమార్‌ను దేవాదాయశాఖ అధికారులు బదిలీ చేయడంతో తిరిగి ఆ స్థానంలో డిప్యూటీ ఈఓ హోదాలో తిరిగి భాస్కర్‌ శర్మ రానున్నట్లు తెలిసింది. వారం రోజులుగా నవీన్‌ కుమార్‌ సెలవుల్లో ఉన్నారు. బదిలీకి సంబంధించిన ఉత్తర్వుల ప్రకటన దేవాదాయశాఖ నుంచి అధికారికంగా రావాల్సి ఉంది.

మండలానికి, మున్సిపాలిటీకి వేర్వేరుగా తహసీల్దార్లు

మిర్యాలగూడ టౌన్‌ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ కార్పొరేషన్‌ పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు, మున్సిపాలిటీకి ప్రభుత్వం వేర్వేరుగా తహసీల్దార్లను నియమించాలనే ఆలోచన చేస్తోంది. ఆయా చోట్ల ఒక్క తహసీల్దార్‌ ఉండడంతో పనులన్నీ పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయం ఒక్కటే ఉన్నా.. ఒకరు గ్రామీణ ప్రాంతాలు, మరొకరు మున్సిపాలిటీని చూసుకునేలా ఇద్దరు తహసీల్దార్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్‌ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement