మీరైనా న్యాయం చేయండి సారూ..
ఫ ప్రజావాణిలో వృద్ధురాలి వేడుకోలు
ఫ కుమారులు పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతం
భువనగిరిటౌన్ : కలెక్టర్ సారూ.. చరమాంకంలో ఉన్న తన బాగోగుల గురించి కొడుకులు, కోడళ్లు పట్టించుకోవడం లేదు.. ఆర్డీఓ చెప్పినా ఖాతరు చేస్తలేరు.. మీరైనా న్యాయం చేయండంటూ ఓ వృద్ధురాలు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతరావును వేడుకుంది. నడవలేని స్థితిలో కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధురాలిని చూసిన కలెక్టర్.. స్టేజీ దిగి ఆమె వద్దకు వచ్చి సమస్య తెలుసుకున్నారు. వివరాలిలా.. రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మల్లెబోయిన మీనమ్మకు ఇద్దరు కుమారులు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసి, ఆస్తిపాస్తులను పంచి ఇచ్చింది. కాగా వృద్ధాప్యంలో ఉన్న మీనమ్మ బాగోగులను కుమారులు పట్టించుకోకపోవడంతో గత ఏడాది డిసెంబర్ 6న ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు గోడు చెప్పుకుంది. స్పందించిన కలెక్టర్.. చౌటుప్పల్ ఆర్డీఓ వద్దకు పంపించారు. ట్రిబ్యునల్‌లో ఆర్డీఓ విచారణ చేసి మీనమ్మ పోషణ, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా కొంత నగదు చెల్లించాలని కుమారులను ఆదేశించారు. కానీ, ఆదేశాలను బేఖాతరు చేయకపోవడంతో ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేయాలని రామన్నపేట సీఐకి ఆర్డీఓ లేఖ రాశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో మీనమ్మ మరోసారి ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌ను కలిసి కన్నీటి పర్యంతమైంది. ఆర్డీఓతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ ఆమెకు భరోసా ఇచ్చి పంపించారు.
అత్యధికంగా రెవెన్యూ సమస్యలపైనే..
ప్రజావాణికి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. 36 అర్జీలు రాగా అందులో 15 రెవెన్యూకు సంబంధించినవే ఉన్నాయి. దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ విష్ణువర్ధన్ రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు.
మీరైనా న్యాయం చేయండి సారూ..


