సన్మాన సభలో దొంగల చేతివాటం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో మంగళవారం జరిగిన సర్పంచ్‌ల సన్మానోత్సవం, ఆత్మీయ సభలో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రసంగం ముగిసిన తర్వాత సర్పంచ్‌లను సన్మానించారు. ఆ సమయంలో వేదిక పైకి సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు వారి వెంట వచ్చిన నాయకులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. ఈ క్రమంలో రాజాపేట, తుర్కపల్లి, ఆలేరు, గుండాల, యాదగిరిగుట్ట మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకుల జేబుల్లో నుంచి డబ్బులను దొంగలు కొట్టేశారు. సుమారు రూ.1.50లక్ష నుంచి రూ.2లక్షల వరకు నాయకుల జేబుల్లో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులు నొక్కేశారు. సన్మానాలు ముగిసిన తర్వాత జేబులను చూసుకున్న నాయకులు డబ్బులు పోయిన సంగతి తెలుసుకొని పోలీసులకు తెలిపారు.
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.10కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న కానుకలను కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది మంగళవారం లెక్కించారు. హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు రూ.2,10,04,942 వచ్చినట్లు ఈఓ తెలిపారు. మిశ్రమ బంగారం 75 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 600గ్రాములు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ సైతం వచ్చిందని, ఈ ఆదాయం 29 రోజులదని ఈఓ తెలిపారు.


