పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం
ఈ ఫొటోలోని రైతు నిడమనూరు మండలం వేంపాడు శివారులోని కుమ్మరిగూడేనికి చెందిన మల్లికంటి కోటయ్య. ఆయన తనకున్న 8 ఎకరాల్లో 6 ఎకరాలకు పైగా భూమిలో బత్తాయి, మిగతా భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఎకరానికి రూ.3.5 లక్షలతో రాతి స్తంభాలతో పందిరి ఏర్పాటు చేసుకుని బీర, దొండ, కాకర వంటి తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నాడు. వారానికి ఒకసారి మిర్యాలగూడ, నల్లగొండ మార్కెట్‌కు కూరగాయలు తరలిస్తున్నారు.
నిడమనూరు : ఇతర పంటలతో పోలిస్తే రైతులకు పందిరి సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. మార్కెట్‌కు అనుగుణంగా గ్రామీణ యువత పందిరి సాగుపై దృష్టి సారిస్తున్నారు. నిడమనూరు మండలంలోని నాన్ ఆయకట్టు గ్రామాల్లో ఒకప్పుడు బత్తాయి, కంది, పెసర, మినుము వంటి సంప్రదాయ పంటలు సాగు చేసేవారు. బత్తాయి సాగులో ఎరువులు, రసాయనిక పురుగు మందుల వాడకంతో ఫలసాయం కంటే తోట పోషణ రైతుకు ఆర్థిక భారంగా మారింది. దీంతో కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించి, వాటిపై వచ్చిన ఆదాయాన్ని బత్తాయి తోటకు పెట్టుబడిగా పెడుతున్నారు. బత్తాయిపై వచ్చిన ఆదాయాన్ని రైతు స్థిరమైన వార్షిక ఆదాయంగా చెప్పకుంటున్నారు. తీగ జాతి కూరగాయల సాగుతో రైతులు వారానికి మార్కెట్, రవాణా ఖర్చులు పోను సగటున రూ.25వేల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. తీగ జాతి పంటల సస్యరక్షణ చర్యలకు ఎరువులు, పురుగు మందల వాడానికి నెలకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంతేగాకుండా బీర, కాకర తీగ పంటకాలం ముగిసేలోపు టమాట కూడా అంతరంగా ముందుగానే వేస్తున్నారు. దీంతో సగటున రైతులు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు స్థిరమైన ఆదాయం పొందుతున్నారు.
ఫ 20 గుంటల్లో కాకర సాగు చేస్తూ.. వారానికి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడితో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం రైతు కోటయ్య చెబుతున్నాడు.
ఫ అదేవిధంగా అర ఎకరంలో దొండ సాగుతో వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని, వారానికి రూ.5వేల నుంచి రూ.8వేల వరకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఫ 10 గుంటల భూమిలోనే (5 నుంచి 8 వరుసలు) బీర సాగు చేశానని, వారానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, క్వింటాల్‌కు రూ.3 వేల వరకు లభిస్తోందని కోటయ్య చెబుతున్నారు.
పందిరి సాగుతో స్థిరమైన ఆదాయం


