ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

Dec 24 2025 5:13 AM | Updated on Dec 24 2025 5:13 AM

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ.. ఒకరు మృతి

ఇద్దరికి గాయాలు

చందంపేట : ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన చందంపేట మండలంలోని గాగిళ్లాపురం వద్ద మంగళవారం జరిగింది. బుడ్డోనితండాకు చెందిన లింగాల లక్ష్మయ్య(42) తన కుమార్తె సంధ్య, భార్య శోభతో కలిసి ద్విచక్ర వాహనంపై దేవరకొండ నుంచి బుడ్డోనితండాకు వెళ్తుండగా.. గాగిళ్లాపురం వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు గాయాలయ్యాయి. లక్ష్మయ్య కుమార్తె సంధ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు, భార్య శోభను దేవరకొండకు తరలించారు. లక్ష్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి దుర్మరణం

మరొకరికి గాయాలు

డిండి : బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో యువకుడు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన మన్మెమోని విజయ్‌(25) అదే గ్రామానికి చెందిన చింతకుంట్ల కృష్ణయ్యతో కలిసి సోమవారం ఎర్రగుంటపల్లిలో బంధువుల ఫంక్షన్‌కు హాజరై అర్ధరాత్రి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యలో వావిల్‌కొల్‌ గ్రామ శివారులోకి రాగానే బైక్‌కు అడవి పంది తగలడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక సీట్లో కూర్చున్న కృష్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కృష్ణయ్యను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి నారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పత్తి దగ్ధం..

ఇద్దరిపై కేసు నమోదు

అడ్డగూడూరు : మండల పరిధిలోని కోటమర్తిలో సోమవారం సర్పంచ్‌ పాశం విష్ణువర్ధన్‌రావు ప్రమాణ స్వీకార ర్యాలీలో అదే గ్రామానికి చెందిన మనిపెద్ది సురేందర్‌, మనిపెద్ది మత్స్యగిరి టపాకాయలు కాల్చగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి గూడ సోమయ్య ఇంట్లో నిల్వ చేసిన సుమారు 4 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు సురేందర్‌, మత్స్యగిరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మంగళవారం ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

అట్టహాసంగా

రైతు దినోత్సవం

నకిరేకల్‌ : గాంధీ విజ్ఞాన్‌ ప్రతిష్టాన్‌, గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలో నకిరేకల్‌లో మంగళవారం నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవం అట్టహాసంగా సాగింది. రైతు ఆత్మగౌరవం – సుస్థిర వ్యవసాయం– పర్యవరణ పరిరక్షణ– ప్రాణ కోటి సుస్థిర ఆరోగ్యంపై రాష్ట్ర స్థాయిలో మహాత్మాగాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు, స్వదేశీ మేళాను కోలాహలంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి హాజరై రైతుల సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాణించిన వారికి కిసాన్‌ సేవారత్న అవార్డులను ప్రదానం చేశారు. సభా వేదికపై విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. ఒక అడుగు ఎత్తుగల 1156 గాంధీ విగ్రహలు, 156 చరకాల ప్రదర్శన, ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement