సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలి
సూర్యాపేట : కర్ల రాజేష్ మృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థపాక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ల రాజేష్ మృతికి కారకులైన ప్రతి ఒక్క అధికారిని సస్పెండ్ చేయాలన్నారు. చిలుకూరు ఎస్‌ఐ సురేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుండా స్థానిక ఎమ్మెల్యేనే కాపాడుతున్నారంటూ ఆరోపించారు. ఎస్‌ఐని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో బీసీ వర్గానికి చెందిన కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. ఎస్‌ఐ బలమైన సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టే వదిలేశారని ధ్వజమెత్తారు. కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఎస్పీ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో ఎస్పీ స్వతంత్రుడిగా లేడన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, చిలుకూరు ఎస్‌ఐ సురేశ్‌రెడ్డిని సస్పెండ్ చేయలేదని ఆరోపించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో లక్ష్మీకాంత్‌రెడ్డితోనే ఎందుకు పోస్టుమార్టం చేయించారని, కోదాడ నుంచి హైదరాబాద్ వరకు పోలీసుల వాహనంలో రామకృష్ణారెడ్డినే వీడియోగ్రాఫర్‌గా తీసుకెళ్లి ఎందుకు వీడియోలు తీయించారని ప్రశ్నించారు. నవంబర్ 10న కోదాడ కోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ.. డిసెంబర్ 1న హైకోర్టులో సమర్పించిన రిమాండ్ డైరీ ఎలా మారుతుందన్నారు. కోర్టు ముందు ఐకాన్ ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ ఎలా చేస్తారన్నారు. ఈ అవకతవకలకు చిలుకూరి ఎస్‌ఐ మూలకారకుడని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంజేఎఫ్ సీనియర్ అడ్వకేట్ డప్పు మల్లయ్య, బచ్చలకూరి వెంకటేశ్వర్లు, చింతలపాటి చిన్న శ్రీరాములు, యాతాకుల రాజన్న, చింత వినయ్‌బాబు, ఎర్ర వీరస్వామి, ములకలపల్లి రవి, తళ్లమళ్ల హుస్సేన్, కోట గోపి, బొల్లెద్దు వినయ్, కనుకుంట్ల వెంకన్న, గ్యార కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ


