చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆలేరురూరల్: రోడుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బింగి దామోదర్(32) తన తల్లితో ఉంటూ కోడిగుడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దామోదర్ బుధవారం పని నిమిత్తం బైక్‌పై ఆలేరుకు వచ్చి తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా.. కొలనుపాక వాగు వద్దకు రాగానే బైక్, ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దామోదర్‌ను వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడి అన్న గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కొండల్‌రావు తెలిపారు.
పశువులను తరలిస్తున్న లారీల పట్టివేత
బీబీనగర్: లారీల్లో అక్రమంగా పశువులను తరలిస్తుండగా బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు టోల్‌ప్లాజా వద్ద గురువారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి నుంచి హైదరాబాద్ వైపు రెండు లారీల్లో 155 పశువులను తరలిస్తుండగా పట్టుకుని, సరైన ఆధారాలు చూపకపోవడంతో పశువులను గోశాలకు తరలించినట్లు సీఐ తెలిపారు.
అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
చౌటుప్పల్: వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన వ్యక్తి పడాల వెంకటేశ్వరరావు(50) యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో నివాసముంటున్నాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులో గల శ్రీపతి ల్యాబ్ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం ఇంట్లోనే వెంకటేశ్వరరావు వాంతులు, విరేచనాలు చేసుకున్నాడు. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందికి గురయ్యాడు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పడాల పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
డైట్ సెట్‌లో 20వ ర్యాంకు
మిర్యాలగూడ టౌన్ : డైట్ సెట్ ఫలితాల్లో మిర్యాలగూడ మండలం బి.అన్నా రం గ్రామానికి చెందిన బి.రామకృష్ణ రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. డైట్ సెట్ ప్రవేశ పరీక్షను మే 25న నిర్వహించగా.. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. రామకృష్ణ 5వ తరగతి వరకు బి.అన్నారంలో, ఇంటర్మీడియట్ వరకు రాజపేట గురుకుల పాఠశాలలో, డిగ్రీ నిజాం కళాశాలలో, పీజీ ఓయూలో పూర్తి చేశాడు.
చికిత్స పొందుతూ యువకుడు మృతి


