వంద రోజుల్లో సమస్యల పరిష్కారం
మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణ
రోజువారీగా కార్యక్రమాలు
జూన్ 2వ తేదీ నుంచి అమలు
సమస్యలు గుర్తించే పనిలో యంత్రాంగం
భువనగిరిటౌన్ : మున్సిపాలిటీల అభివృద్ధిపై యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది. ముఖ్యంగా పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం, పార్కులను అభివృద్ధి చేయటం, శిథిల భవనాలను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ, వైద్యశిబిరాల నిర్వహణ తదితర సమస్యలపై అధికారులు ఫోకస్ పెట్టారు. గుర్తించిన సమస్యలను రోజు వారీ కార్యక్రమాల ద్వారా వంద రోజుల్లో పరిష్కరించనున్నారు. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా అన్ని చోట్ల జూన్ 2నుంచి కార్యాచరణ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్ర మాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేయనున్నారు.
రోజువారీ కార్యక్రమాలు ఇలా..
● వరద కాల్వల్లో పూడికతీత
● మొక్కలు నాటడానికి స్థలాల గుర్తించడం
● మొక్కల సేకరణ, నర్సరీలో నిల్వలపై పరిశీలన
● భువన్ సర్వేకోసం వార్డులవారీగా అధికారుల నియామకం
● ఆస్తిపన్ను సమాచారాన్ని వేరు చేయడం
● మంచినీటి కుళాయి కనెక్షన్ల నవీకరణ
● ఆస్తుల మార్పిడికి సంబంధించిన ధ్రువపత్రాల సేకరణ
● వైద్యారోగ్య శిబిరాల నిర్వహణకు వైద్యులతో సంప్రదింపులు
● టెండర్లు పిలిచి పార్కులను మరింత అభివృద్ధి చేయటం
● విభాగాలకు అప్పగించిన పనులకు సంబంధించి ఉద్యోగులకు అంతర్గత సర్క్యులర్లు జారీ.
● చేపట్టిన పనులు రోజువారీగా పర్యవేక్షణ, నివేదికలు ఇచ్చేందుకు వార్డుల వారీగా అధికారుల నియామకం.
● స్వచ్ఛతపై ఇంటింటి ప్రచారం, అందుకు అవసరమయ్యే వాహనాలు, సిబ్బంది, సామగ్రి సమకూర్చుకోవడం
● వీధి వ్యాపారుల తాత్కాలిక కమిటీల ఏర్పాటు
● వ్యాపార, వాణిజ్య సముదాయాలను గుర్తించి నమోదు చేస్తారు.
● కొత్తగా స్వయం సహాయక సంఘాలఏర్పాటు
● ఇందిరా, మహిళా శక్తి మిషన కింద అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు ప్రణాళికల రూపకల్పన
● ఇందిరా, మహిళా శక్తి క్యాంటీన్ల ప్రారంభానికి కార్యాచరణ
మున్సిపాలిటీ వార్డులు
భువనగిరి 35
మోత్కూర్ 12
ఆలేరు 12
పోచంపల్లి 13
చౌటుప్పల్ 20
యాదిరిగుట్ట 12


