మెరికల్లాంటి కార్యకర్తలకే ప్రాధాన్యం
ఆలేరు: మెరికల్లాంటి కార్యకర్తలు, నాయకులకే గ్రామ, మండల, బ్లాక్‌స్థాయి పార్టీ పగ్గాల అప్పగింతలో అధిక ప్రాధాన్యం ఉంటుందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం లేక పదేళ్లు ఎంత గోస పడ్డామో మీకు తెలుసని,.. ఇప్పుడు అధికారంలోకి వచ్చామనే ధీమాతో ఉన్నా.. ఉదాసీనత ధోరణి వీడాలని సూచించారు. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో..వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యమనే విషయాన్ని విస్మరించొద్దన్నారు. పార్టీ పదవులు అలంకారప్రాయం కాకూడదని.. నిత్యం ప్రజలతో మమేకమవ్వాలన్నారు. సైనికుల్లా పనిచేసే వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడూ మరింత బాధ్యతగా గ్రామాలు, మండల స్థాయిలో పర్యటిస్తూ రాష్ట్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ పదవుల విషయంలో ఎవరూ పోటీ పడొద్దన్నారు. ఎవరేం చేస్తున్నారో హైకమాండ్ గమనిస్తోందన్నారు. సంస్థాగత ఎన్నికల్లో పదవులను తాను నిర్ణయించనని.. కార్యకర్తలు, నాయకుల అభీష్టమే ఫైనల్ అని చెప్పారు. ఈసారి కమిటీల్లో మహిళలకు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అందరూ పని చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి పదవులతోపాటు తనవంతు ఆర్థిక సాయం అందించడానికి ముందుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు ధన్వంతరి, జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఇన్‌చార్జి అనిల్, మదర్‌డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్‌రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, నాయకులు ఎంఎస్ విజయకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎంఏ.ఇజాజ్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఫ స్థానిక సమరంలో గెలుపే లక్ష్యం
ఫ ఈసారి కమిటీల్లో మహిళలకు చోటు
ఫ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


