కోఆప్షన్ కావాలని..
వీరికి అవకాశం
సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇక కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కన్ను కో–ఆప్షన్‌పై పడింది. పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు, రిజర్వేషన్ కలిసిరాని వారు తమకు అవకాశమివ్వాలని జిల్లా నేతలను కలుస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా తమకు అనుకూల వ్యక్తులను కో–ఆప్షన్ స్థానంలో నియమించుకునేందుకు సర్పంచ్‌లు సైతం దృష్టి సారించారు.
ఒక్కో పంచాయతీలో ముగ్గురు..
పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామపంచాయతీ పాలకవర్గంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులు ఉంటారు. కో–ఆప్షన్ సభ్యులకు ఓటు హక్కు మినహా వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి త్వరలో ఉత్తర్వులు జారీ కానుండటంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.
ఓటు హక్కు మినహా అన్ని అధికారాలు
కో–ఆప్షన్ సభ్యులు ఓటు హక్కు మినహా వార్డుసభ్యులతో సమానమైన అధికారాలు, హోదా కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీ సమావేశాలకు కో–ఆప్షన్ సభ్యులకు తప్పనిసరిగా అహ్వానించాల్సి ఉంటుంది. అయితే తీర్మానాల ఆమోదం విషయంలో మాత్రం వీరికి ఏమేరకు ప్రాధాన్యత ఉంటుందనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యులుగా మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన వారినే నియమించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యుల నియామకంలో మాత్రం అలా లేదు.
ఆశావహుల పైరవీలు
ఫ ప్రతి గ్రామ పంచాయతీలో ముగ్గురు సభ్యుల నియామకం
ఫ వార్డు మెంబర్లతో సమాన హోదా, గౌరవం
ఫ త్వరలో అధికారిక ఉత్తర్వులు
ఫ జిల్లాలో 427 పంచాయతీలు
ప్రతి పంచాయతీలో కో–ఆప్షన్ సభ్యులుగా ముగ్గురిని నియమించనుండగా.. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలికి తప్పకుండా అవకాశం కల్పించాలి. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించిన దాతను, లేదా గ్రామానికి సేవ చేసే ఎన్‌ఆర్‌ఐని కూడా నియమించుకోవచ్చు. జిల్లాలో 427 పంచాయతీలకు డిసెంబర్ 11,14,17న మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ప్రతి పంచాయతీకి ముగ్గురు చొప్పున 1,281 మంది కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులు ఎక్కుమంది సర్పంచ్‌లుగా ఉండటంతో.. వారి మద్దతుదారులకు ఎక్కువగా కో–ఆప్షన్ సభ్యుల పదవులు దక్కే అవకాశం ఉంది.


