ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు
ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలి
భువనగిరి: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వంద శాతం ఉత్తీర్ణత శాతమే లక్ష్యంగా.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన విద్యాశాఖ.. శనివారం నుంచి రెండో విడత ప్రణాళిక అమలు చేయనుంది. 52 రోజుల పాటు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే తొలి విడత కింద 66 రోజుల ప్రణాళిక రూపొందించి సాయంత్రం సమయంలో రోజుకు గంట చొప్పున అక్టోబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
9,632 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా 180 ప్రభుత్వ పాఠశాలల్లో 5,464 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మార్చి నెలలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండో విడతలో భాగంగా 52 రోజుల కార్యాచరణ అమలు చేయనున్నారు. డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి చేశారు. శనివారం (నేడు) నుంచి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.15 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు ఉంటాయి.
మరింత మెరుగైన స్థానం కోసం..
గత విద్యా సంవత్సరానికి ముందు వరుసగా మూడేళ్ల పాటు జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనుకబడుతూ వచ్చింది. 2024–25 విద్యా సంవత్సరానికి ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో మెరుగైన స్థానంలో ఉండేలా కలెక్టర్ హనుమంతరావు, విద్యాశాఖ అధికారులతో కలిసి వినూత్న కార్యక్రమాలు అమలు చేశారు. వీటిలో ప్రధానంగా వేకప్ కాల్ పేరుతో విద్యార్థులకు ఫోన్ చేయటం, విద్యార్థి ఇంటి తలుపు తట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. డీఈఓ, ఎంఈఓలతో పాటు ఇతర విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వేకువజామునే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేశారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నగదు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వడం జరిగింది. అధికారులు సమష్టి కృషితో జిల్లా రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. ఇదే స్ఫూర్తితో ఈ విద్యా సంవత్సరం ప్రథమ స్థానం సాధించాలన్న సంకల్పంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.
కార్యాచరణ ఇదీ..
● ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
● సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి విద్యాబోధన చేయాలి.
● వారంలో ఒక రోజు పరీక్ష నిర్వహించి వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, మెరుగుపడేలా అభ్యసన సామర్థ్యాలను రూపొందించాలి.
● మార్కుల ఆధారంగా విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి.
పదో తరగతి ఫలితాలల్లో సమష్టి కృషితో గత విద్యా సంవత్సరం రాష్ట్రంలో 7వ స్థానం సా ధించాం. ఈ సారి ప్రథమ స్థానం సాధించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాం.ఇందుకోసం రెండు విడతల ప్రణాళిక రూపొందించి మొదటి విడత పూర్తి చేశాం. ప్రస్తుతం శనివారం నుంచి రెండో విడత అమలు చేస్తున్నాం. 52 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు చేస్తాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ఉత్తమ ఫలితాల సాధనలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలి. ప్రణాళిక పక్కాగా అమలు చేసి లక్ష్యంచేరాలి.
–సత్యనారాయణ, డీఈఓ
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ఫ నేటి నుంచి రెండో విడత కార్యాచరణ
ఫ రెండు పూటలా ప్రత్యేక తరగతులు
ఫ సీ–గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ప్రత్యేక తరగతులను పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయుడు (ఫైల్)


