యాదాద్రి రైల్వే స్టేషన్‌కు సరికొత్త హంగులు | - | Sakshi
Sakshi News home page

యాదాద్రి రైల్వే స్టేషన్‌కు సరికొత్త హంగులు

Aug 1 2023 2:20 AM | Updated on Aug 1 2023 2:04 PM

- - Sakshi

యాదాద్రి: యాదాద్రి రైల్వే స్టేషన్‌ సరికొత్త హంగులు సంతరించుకోనుంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా అత్యున్నత ప్రమాణాలు, సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

రూ.320 కోట్లతో ఘట్కేసర్‌ నుంచి (రాయగిరి) యాదాద్రి వరకు రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఇటీవల యాదాద్రి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఘట్కేసర్‌ నుంచి యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల మేర అదనపు ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు.

రూ.24.5 కోట్లతో ఆధునీకరణ

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. యాదాద్రి ఆలయ క్షేత్ర నమూనాతో రైల్వే స్టేషన్‌ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎంఎంటీఎస్‌ నూతన లైన్‌ కోసం స్టేషన్‌ను తూర్పు వైపు విస్తరించనున్నారు.

ఇందులో భాగంగా నూతన స్టేషన్‌ బిల్డింగ్‌ నిర్మాణం, ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు, పైకప్పుల ఆధునీకరణ, ప్రయాణికులకు వెయిటింగ్‌ హాల్‌, మంచినీరు, టాయ్‌లెట్స్‌ పార్కింగ్‌ ఏరియా పనులను చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్‌లో నూతనంగా నిర్మించి ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న రేల్వే స్టేషన్లు భువనగిరి, బీబీనగర్‌, ఘట్కేసర్‌ స్టేషన్లలో అదనపు మౌళిక వసతులు కల్పిస్తారు.

రెండో దశలో కదలిక

2016 లో మంజూరైన ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు నిధులలేమితో నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెరిగింది. అయితే తమ నిధులతోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని ప్రకటించి పనులకు శ్రీకారం చుట్టింది.

అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఇచ్చినమాట ప్రకారం ఎంఎంటీఎస్‌ యాదాద్రి రైల్వే స్టేషన్‌కు ఈనెల 6వ తేదీన ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. రైల్వేస్టేషన్‌ నిర్మాణం కోసం రూ.24.5 కోట్లు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి నుంచి ఆదేశాలు అందాయి.

యాదాద్రి నుంచి వయా ఆలేరు జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం. కేంద్రం ఇప్పటికే బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు చేసింది. ఏడాదిలోగా నూ తన భవన సముదాయాన్ని ప్రారంభిస్తాం. –పీవీ శ్యాంసుందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

వంగపల్లి వరకు పొడిగింపు ప్రతిపాదన

యాదాద్రి (రాయగిరి) వరకు ఉన్న ఎంఎంటీఎస్‌ లైన్‌ను వంగపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాయగిరి రైల్వే స్టేషన్‌ ఇరుకుగా ఉన్నందున విస్తరించాల్సి ఉంటుంది.

అయితే వంగపల్లి స్టేషన్‌ అనుగుణంగా ఉన్నందున అక్కడి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగించే యోచనలో రైల్వే శాఖఉంది. వంగపల్లి నుంచి కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం ఐదున్నర కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.అయితే వంగపల్లి వరకు పొడిగించే విషయం ఇంకా ఫైనల్‌కాలేదని రైల్వే శాఖఅధికారి ఒకరు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement