బీఆర్‌ఎస్ దొంగ హామీలను నమ్మొద్దు
ఫ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
భువనగిరిటౌన్ : కేసీఆర్ పదేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు మంచి నీరు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైన బీఆర్‌ఎస్ నాయకులు, మళ్లీ దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి పట్టణంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజా సంక్షేమం కోసం హామీలు ఇవ్వని పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి తన శాఖ నుంచి అధిక నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నాయకులు దొంగ హామీలతో మళ్లీ ప్రజల ముందుకు వస్తున్నారని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
అభివృద్ధి చెందాలంటే
కాంగ్రెస్‌కు ఓటు వేయాలి
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అమలు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, పట్టణాల్లో కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్యే కుంభంఅనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా హెచ్‌ఎండీఏ నిధులు సీఎం రేవంత్‌రెడ్డి కేటాయింపు చేసినట్లు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ, చౌరస్తాల అభివృద్ధితో పాటు, సీసీ రోడ్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్‌చిస్తీ, కుంభం కీర్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, చల్లగురుగుల కృష్ణవేణి రఘుబాబు, బెండె స్వరూపలాల్‌రాజ్, గుర్రాల సంతోష శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, పోలిశెట్టి అనిల్‌కుమార్, సూదగాని సరితరాజు, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ దొంగ హామీలను నమ్మొద్దు


