పెద్దవూర : ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రైతులు ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేపట్టారు. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుండటంతో వేరుశనగకు చీడపీడలు సోకడంతో పాటు పోషక లోపాలు తలెత్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి ఏ. సందీప్‌కుమార్ సూచిస్తున్నారు.
పచ్చపురుగు బెడద..
రబీలో శనగపచ్చ పురుగు బెడద అధికంగా ఉంటుంది. మార్చి నెల వరకు ఈ పురుగు ఉధృతి ఉంటుంది. ఆకుల వెనుక రెక్కలు పాలిపోయిన తెలుపు రంగుతో నల్లని అంచు కలిగి ఉంటాయి. గుడ్డు లేదా దాని నుంచి వెలువడిన పిల్ల పురుగులు లేదా ఆకుపచ్చ రంగులో పెరిగిన పురుగులు ముదురు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారతాయి. నల్లని తల ఉన్న చిన్న పురుగులు హరితాన్ని పువ్వు మొగ్గలు, రేకులను గీకి తింటాయి. తర్వాత మొగ్గలు, పువ్వులు, కాయలను తొలిచి తిని డొల్ల చేస్తాయి. ఒకే పురుగు చాలా కాయలను నష్టపరుస్తుంది. వేరుశనగ పంట లేతగా ఉన్నప్పుడు ఇవి ఆకులను తిని నాశనం చేస్తాయి. కాయలకు గుండ్రటి రంధ్రాలు చేసి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. సమగ్ర యాజమాన్య పద్ధతులతో ఈ పురుగును నివారించవచ్చు. ఎకరానికి నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. గుడ్లు, చిన్న పురుగుల నివారణకు ఐదు శాతం వేపనూనెను పంటకు పిచికారీ చేయాలి. ఎన్‌పీవీ ద్రావణాన్ని (వైరస్ ద్రావణం) ఎకరానికి 250 ఎల్‌ఈ తగినంత నీటిలో కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.
ఆకుపచ్చ తెగులు..
పంట వేసిన 30 రోజుల నుంచి ఈ తెగులు కనిపిస్తుంది. గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటాయి. తెగులు కనిపించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల మాంకోజెబ్ లేదా హెక్సాకొనాజోల్ 400 మిల్లీలీటర్లు లేదా కార్భన్‌డిజం 200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
వేరుశనగలో సూక్ష్మ పోషకాలు..
వేరుశనగ మొక్కల పెరుగుదలకు 16 రకాల పోషక పదార్థాలు అవసరం. వీటిలో కాల్షియం, సల్ఫర్, జింక్, ఇనుము చాలా ముఖ్యం. ఇవి మొక్కలకు తగినంత అందనప్పుడు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
● గంధకం : గంధకం నూనె శాతం పెరగడానికి, కాయలు మంచి రంగు కలిగి ఉండేందుకు, కాయ గింజ బరువు పెరగడానికి దోహదపడుతుంది. నేల నుంచి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎక్కువ పరిమాణంలో మొక్క తీసుకోవడానికి గంధకం దోహదం చేస్తుంది. ఊడల నుంచి కాయలు తెగిపోకుండా కాపాడుతుంది. వేర్లలో రైజోబియం బుడిపెలు ఏర్పడడానికి సహకరిస్తుంది. గంధకం లోపిస్తే కొత్త ఆకులలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకుల ఈనెలు పసుపు రంగుకు, లేత ఆకులు పసుపు పచ్చగా మారతాయి. ముదురు ఆకులు మార్పు లేకుండా ఆకుపచ్చగా ఉంటాయి. వీని నివారణకు అమ్మోనియం సల్ఫేట్, సూపర్ పాస్ఫేట్, పొటాషియం సల్ఫేట్ వంటి ఎరువులు వాడాలి. గింజల్లో నూనె శాతం పెరగడానికి విత్తిన 40 రోజులకు జిప్సం వాడాలి.
● ఇనుము..
వేరుశనగలో ఇనుము లోపించినప్పుడు ఆకులు పసుపుపచ్చగా మారుతాయి. తర్వాత ఆకు మొత్తం పసుపు రంగుకు మారుతుంది. లేత ఆకులు సన్నగా, నిటారుగా పసుపు రంగుకు మారి పసుపు రంగు కోల్పోయి, తెలుపు రంగుకు మారతాయి. ముదురు ఆకులు ఎండి రాలిపోతాయి. ఇనుము లోపం వలన కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. పంట ఎదుగుదల ఆగిపోయి దిగుబడి 30–40 శాతం తగ్గుతుంది. వీని నివారణకు ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ఒక గ్రాము సిట్రిక్ ఆమ్లం కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ద్రావణాన్ని ఎప్పటికప్పుడు కలుపుకుంటూ పిచికారీ చేయాల్సి ఉంటుంది.
కాల్షియం : మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైములను ఉత్తేజపర్చడానికి వేర్ల అభివృద్ధికి కాల్షియం బాగా తోడ్పడుతుంది. తాలు కాయలు ఏర్పడకుండా గింజలు లావుగా ఉండి కాయ నాణ్యత పెరిగేందుకు దోహదం చేస్తుంది. వేరు చివరి భాగం నశించి పెరుగుదల ఆగిపోతుంది. ఆకుల్లో పచ్చదనం లోపిస్తుంది. ఆకుల కాండం విరుగుతుంది. కంచు రంగుకు మారి చిగుర్లు వంకరలు తిరుగుతాయి. వేర్ల అభివృద్ధి దెబ్బతిని బుడిపెల సంఖ్య తగ్గుతుంది. కాల్షియం లోప నివారణకు ఎకరాకు 200 కిలోల జిప్సమ్‌ను తొలి పూత దశలో అంటే విత్తిన 40 రోజులకు మొక్క మొదళ్ల దగ్గరికి ఎగదోయాలి. జిప్సం వేసిన తరువాత నీరు పెట్టాలి.


