అడవికి అగ్గి ముప్పు | - | Sakshi
Sakshi News home page

అడవికి అగ్గి ముప్పు

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

వేసవిలో కార్చిచ్చు అంటుకోకుండా అప్రమత్తమైన అటవీ అధికారులు

ముందుగానే అవగాహన కల్పిస్తున్నాం

వేసవిలో కార్చిచ్చు అంటుకోకుండా అప్రమత్తమైన అటవీ అధికారులు

హాలియా (నాగార్జునసాగర్‌) : పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు కీలక భూమిక పోషి స్తాయి. అనేక జంతు, వృక్ష జాతులతో జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు అడవులు తోడ్పడతాయి. భూసారాన్ని కాపాడతాయి. ఒకవిధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం. అలాంటి అడవులకు నిప్పు పెట్టడం వలన మానవ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఉమ్మడి నల్ల గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల మధ్యన కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 2,166 చదరపు కిలోమీటర్ల మేర అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ విస్తరించి ఉంది. ఇందులో నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో నాగార్జునసాగర్‌ రేంజ్‌లో 76,350 ఎకరాలు, దేవరకొండ రేంజ్‌లో 9,945 ఎకరాలు, కంబాలపల్లి రేంజ్‌లో 28,000 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. ఈ అటవీ ప్రాంతాల్లో ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవిలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మానవ తప్పిదాల వలన అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకోకుండా అటవీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. నాగార్జునసాగర్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో జీవాలను మేపకుండా నిషేధం విధించినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టకుండా శివారు గ్రామాలు, తండాల ప్రజలకు కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

తరచూ ప్రమాదాలు..

సాగర జలాశయం, కృష్ణా నది ఇరువైపులా నల్ల మల అటవీ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. మూడేళ్ల క్రితం కృష్ణా నది తీరంలో జమ్మనకోట ప్రాంతంలో రాత్రివేళ అడవికి నిప్పంటుకుంది. వెంటనే అటవీ అధికారులు దగ్గరలోని తండావాసుల సహకారంతో చెట్లకొమ్మలతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే సుమారు 8 నుంచి 10 ఎకరాల అటవీ ప్రాంతం తగలబడిపోయింది. అంతకుముందు ఏడాది సాగర్‌ జలాశయ తీరంలో దయ్యాలగండి సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగగా.. అధికారులు సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేశారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో నాగాలారం ప్రాంతంలో మంటలు అంటుకొని 100 ఎకరాల అడవి తగలబడింది. ఇటీవల దేవరకొండ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో నక్కలగండి శివారులో అగ్నిప్రమాదం జరిగింది.

నాగార్జునసాగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో జీవాలను మేపడంపై నిషేధం

శివారు గ్రామాల ప్రజలకు

కళాజాతతో అవగాహన

24 గంటల పాటు ప్రత్యేక పెట్రోలింగ్‌

తీసుకోవాల్సిన చర్యలు

వేసవిలో అడవిలోకి జీవాలు వెళ్లకుండా చూడాలి.

అగ్గిపెట్టె, కిరోసిన్‌, పెట్రోల్‌ వంటి వాటిని అడవిలోకి తీసుకెళ్లకుండా నిషేధించాలి.

ఆకులు ఎక్కువగా రాలే అటవీ ప్రాంతంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట ట్రంచ్‌ ఏర్పాటు చేయాలి.

అటవీ ప్రాంతంలో చెక్‌డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చూడాలి.

ఎత్తైన వాచ్‌టవర్లు ఏర్పాటు చేసి మనుషులు అడవిలోకి రాకుండా అటవీ అధికారులు గమనించాలి.

వేసవిలో అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కళాజాతతో ప్రచారం చేయిస్తున్నాం. మంటలు చెలరేగే ప్రాంతాలను గుర్తించి ఫైర్‌ వాల్స్‌ ఏర్పాటు చేశాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్‌ క్యాంప్‌ హెల్పర్లు 24 గంటలు కాపలాగా ఉంటున్నారు. ఇటీవల నెల్లికల్లు బీట్‌లో నిర్మించిన వాచ్‌టవర్‌ నుంచి అన్నివేళలా నిఘా ఏర్పాటు చేశాం. శివారు తండాలు, గ్రామాల ప్రజలను చైతన్యపరిచి అగ్నిప్రమాదాలు సంభవించకుండా చూస్తున్నాం. – రమేశ్‌, సెక్షన్‌ ఆఫీసర్‌,

నాగార్జునసాగర్‌ వణ్యప్రాణుల విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement