నల్లగొండ : హైదరాబాద్ తరహా వైద్యం నల్లగొండ జిల్లా కేంద్రంలో అందించేలా సాయి నైసా మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బోయవాడలో సాయి నైసా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నూతన భవనాన్ని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెంటిలేటర్లతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ డయాలసిస్, అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ అమలులో తన సహకారం ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చేవారికి ముందుగా డబ్బులు అడగకుండా వైద్యం అందించాలని సూచించారు. నాణ్యమైన వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రాపోలు అనిల్‌కుమార్, డాక్టర్ రాపోలు దివ్య మాట్లాడుతూ.. గత ఆరేళ్లుగా ప్రైవేట్ భవనంలో ఆస్పత్రిని నడిపామని, ప్రస్తుతం ఆధునిక సౌకర్యాలతో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించామన్నారు. డయాలసిస్, వెంటిలేటర్, అల్ట్రాసౌండ్, స్కానింగ్ వంటి వైద్య సేవలు తమ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, అబ్బగోని కవితారమేష్‌గౌడ్, చెరుపల్లి సీతారాములు, ఆస్పత్రి చైర్మన్ రాపోలు దత్తగణేశ్, ప్రమీలాదేవి, మేనేజింగ్ డైరెక్టర్ రాపోలు అవంత్, అవని, గజం మురళి, అనిత పాల్గొన్నారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


