మున్సిపాలిటీల్లో నేటి నుంచి డ్రైడే
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో డ్రై డే ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు ఆదివారం తెలిపారు. 9వ తేదీ(సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ప్రక్రియ మూసే వరకు, తిరిగి 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ పూర్తయ్యే వరకు మున్సి పాలిటీల పరిధిలో డ్రై డే గా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గల మద్యం దుకా ణాలు, రిటైల్ షాప్స్, బార్లు, కల్లు దుకాణాలు అన్ని మూసి ఉంచాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు
మోత్కూరు : ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి కోసం మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కె.సతీష్‌కుమార్ ఆదివారం తెలిపారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించిన ఓటరు జాబితా, గుర్తింపు పత్రాలు, విధి నిర్వహణ పత్రాలను జత పరుస్తూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ డి.బాలాజీ, రాజకీయ ప్రతినిధులు వనం శాంతికుమార్, బి.యాదగిరి తదితరులున్నారు.
యాదగిరీశుడికి బంగారు వాహనాలు బహూకరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు రాగిపై బంగారు తాపడం చేసిన వాహన సేవలను ఆలయ ఈఓ భవానీ శంకర్‌కు అందజేశారు. ఆదివారం ఉప్పల అశోక్, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ముఖ మండపంలో రాగిపై బంగారు తాపడం చేసిన హనుమంత, గజ వాహనాలను అందజేశారు. అదేవిధంగా ఆండాళ్ అమ్మవారికి మకర తోరణం బహుకరించారు. వీటి విలువ సుమారు రూ.15,00,000 ఉంటుందని వెల్లడించారు.
మున్సిపాలిటీల్లో నేటి నుంచి డ్రైడే


