ఎవరి వ్యూహం వారిదే..
మున్సిపాలిటీల్లో విజయమే లక్ష్యంగా ముఖ్య నేతల ప్రచారం
సాక్షి, యాదాద్రి : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగియనుంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యనాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చైర్ పర్సన్ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
● మోత్కూర్ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ పోటీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మందుల సామేల్ తమ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థులు, కోఆర్డినేటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కడెం రామచంద్రయ్య ప్రచారం చేస్తున్నారు.
● చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీలు సొంతంగానే పోటీ చేస్తుండగా బీఆర్‌ఎస్, సీపీఎంలు పొత్తుపెట్టుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ అభ్యర్థుల తరపున ప్రచార చేశారు. బీఆర్‌ఎస్, సీపీఎం తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరఫున ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డిలు ప్రచారం చేస్తున్నారు.
● భువనగిరి మున్సిపాలిటీలో 35 స్థానాలకు ముక్కోణపు పోటీ నడుస్తోంది. కొన్ని వార్డులో కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్నట్లు ఉంది. మరికొన్ని వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుండగా. బీఆర్‌ఎస్ సీపీఎం, సీపీఐల పొత్తుతో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చైర్మన్ అభ్యర్థిగా ఎవరి పేరు ఇంకా ప్రకటించలేదు. మెజార్టీ స్థానాలు గెలిచిన తర్వాత చైర్మన్‌ను ఎన్నుకుంటామని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. మంత్రిసీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ మిత్ర పక్షాల తరపున మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ తరపున రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, పాశం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డి, సమన్వయ కర్తలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
● ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. చైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకుంటామని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎవరికి వారే ధీమాతో ఉన్నాయి. మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థుల తరపున పడాల శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు.
ఫ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ హోరాహోరీ
ఫ భువనగిరిలో ముక్కోణపు పోటీ
ఫ నేటితో ముగియనున్న
ఎన్నికల ప్రచారం
ఫ పోచంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు 13 వార్డుల్లో పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఇరు పార్టీలకు చెందిన చైర్మన్ అభ్యర్థులైన తడక వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్ నుంచి గుండు మధు 12వ వార్డ్ నుంచి బరిలోకి దిగారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్ని వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లను ఒకటి, రెండు అటు, ఇటుగా పంచుకోనున్నాయి. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి పదవ వార్డులో ఏక గ్రీవమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడు ఎనిమిది వార్డుల్లో అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇటీవల మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గుట్ట పట్టణంలోని అన్ని వార్డులలో పర్యటించి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా తమ అభ్యర్థులను గెలిపించాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీఆర్‌ఎస్ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యులు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు.


