లోకల్‌ ఫీవర్‌ | - | Sakshi
Sakshi News home page

లోకల్‌ ఫీవర్‌

Nov 16 2026 1:26 AM | Updated on Nov 16 2026 1:26 AM

నేడు వైఎస్సార్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థుల నామినేషన్లు

ఏఐ సృష్టించిన చిత్రం

సాక్షి, భీమవరం: జిల్లాలో పట్టణం, గ్రామాల్లో స్థానిక ఎన్నికల హడావుడి నెలకొంది. మలి విడతలోని నాలుగు మున్సిపాల్టీల్లో నామినేషన్లకు నేటితో గడువు ముగుస్తోంది. మొత్తం 188 వార్డులకు రెండో రోజు 145 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మిగిలిన వారంతా సోమవారం నామినేషన్లకు సన్నాహాలు చేసుకున్నారు. మరోపక్క తొలి విడతలోని 90 పంచాయతీల్లో నామినేషన్ల సందడి మొదలైంది.

నామినేషన్లు ఇలా..

● భీమవరంలో మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక నామినేషన్‌ దాఖలు కాగా 52 వార్డులకు 48 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ నుంచి 15 నామినేషన్లు రాగా టీడీపీ నుంచి ఏడు, కాంగ్రెస్‌ నాలుగు, జనసేన రెండు, బీజేపీ రెండు, సీపీఎం ఒకటి, స్వతంత్రులుగా 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

● తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ నుంచి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. 48 వార్డులకు 53 నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 20, జనసేన నుంచి 19, టీడీపీ నుంచి తొమ్మిది, బీజేపీ ముగ్గురు, స్వతంత్రులుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.

● తణుకులో 44 వార్డులకు 18 నామినేషన్లు రాగా వాటిలో వైఎస్సార్‌సీపీ నుంచి 13, టీడీపీ ఐదు వచ్చాయి.

● పాలకొల్లులో 44 వార్డులకు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 17, వైఎస్సార్‌సీపీ నుంచి ఐదు, కాంగ్రెస్‌ ఒకటి, బీఎస్పీ ఒకటి, జనసేన ఒకటి ఉన్నాయి.

నేటితో ముగియనున్న స్వీకరణ

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుండగా చివరి రోజున అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. 17న పరిశీలన, 19న 3 గంటల వరకు ఉప సంహరణకు గడువుంది. అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థులు జాబితాను ప్రకటిస్తారు. 26న పోలింగ్‌, 30న ఓట్లు లెక్కింపు జరుగనుంది.

సర్పంచ్‌లకు 78 నామినేషన్లు: జిల్లాలో 393 పంచాయతీలు, 4,206 వార్డులకు తొలి విడతగా ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని 90 పంచాయతీలు, వాటి పరిధిలోని 1,006 వార్డులకు ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తొలిరోజు 38 పంచాయతీలకు సంబంధించి 78 నామినేషన్లు వచ్చాయి. వార్డుల కోసం 206 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్‌ అభ్యర్థులుగా ఆచంట మండలంలో ఆరు పంచాయతీలకు ఎనిమిది నామినేషన్లు రాగా పెనుగొండలో ఎనిమిది పంచాయతీలకు 19, పెనుమంట్రలో ఎనిమిది పంచాయతీలకు 14, నరసాపురం రూరల్‌లో 10 పంచాయతీలకు 24, మొగల్తూరులో ఆరు పంచాయతీలకు 13 నామినేషన్లు ఉన్నాయి. కాగా పంచాయతీల్లో నామినేషన్లు దాఖలుకు 17వ తేదీ వరకు గడువు ఉంది.

వేడేక్కిన రాజకీయం

నాలుగు మున్సిపాల్టీల్లో నేటితో ముగుస్తున్న నామినేషన్ల గడువు

చివరి రోజున భారీ ఎత్తున నామినేషన్లకు అభ్యర్థుల సన్నాహాలు

90 పంచాయతీల్లో మొదలైన నామినేషన్ల ఘట్టం

తొలిరోజు 38 పంచాయతీలకు 78 నామినేషన్లు

భీమవరం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పట్టణానికి చెందిన కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి, పట్టణ ప్రముఖుడు యాదాల ప్రసాదరావు సతీమణి వెంకట మాధవీలతను పార్టీ నాయకత్వం ప్రకటించింది. సోమవారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. తాడేపల్లిగూడెం చైర్మన్‌ అభ్యర్థిగా కొప్పుల వెలమ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ గొర్రెల శ్రీనివాస్‌, తణుకు చైర్మన్‌ అభ్యర్థిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యిండుగపల్లి బలరామకృష్ణ, పాలకొల్లు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పార్టీ సీనియర్‌ నేత చందక సత్తిబాబు సతీమణి, మాజీ కౌన్సిలర్‌ ఉమాశైలజ భారీ ఎత్తున పార్టీశ్రేణులతో కలిసి సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement