కలుషిత నీటితో మత్స్య సంపద మృత్యువాత
భీమవరం అర్బన్ : ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొల్లేరు నుంచి సుమారు 52 కిలోమీటర్లు ప్రవహించి, చినగొల్లపాలెం వద్ద సముద్రంలో కలిసే ఉప్పుటేరు డ్రెయిన్ కాలుష్యంతో మృత్యుపుటేరులా మారింది. ఫ్యాక్టరీల నుంచి విడుదలవుతున్న మలాథిన్ వ్యర్థాలు కాలువలో కలవడంతో సహజ మత్స్య సంపద భారీగా మృతి చెందుతోంది.
తీర ప్రాంతంలో భయాందోళనలు
ఈ పరిణామంతో తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు, ఆక్వా రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ డ్రెయిన్‌పై ఆధారపడి ఎంతోమంది మత్స్యకారులు చేపల వేట ద్వారా తమ జీవనోపాధి సాగిస్తున్నారు. అలాగే, డ్రెయిన్ ఆనుకుని వే లాది ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతుండటంతో.. ఈ కలుషిత నీరు చెరువుల్లోకి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
నీటిపై తేలుతున్న మత్స్య సంపద
ఎన్నడూ లేనివిధంగా పండుగొప్ప, కొయ్యొంగ, కట్టెపరిగెలు, పీతలు, రొయ్యలు తదితర సహజ మత్స్య సంపద డ్రెయిన్ ఉపరితలంపై అసహజంగా ఈదుతూ మృత్యువాత పడుతోంది. ఇప్పటికే తుపాన్ల వల్ల తీవ్ర నష్టపోయామని, ఇప్పుడు ఉప్పుటేరు కలుషితం కావడం తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందని మత్స్యకారులు వాపోతున్నారు. ఇదే విషపు నీరు మరో వారం రోజులు డ్రెయిన్‌లో ఉంటే కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాల విడుదల
కొన్ని ఫ్యాక్టరీల యజమానులు తమ పరిశ్రమల నుంచి మలాథిన్ వ్యర్థాలను అక్రమంగా డ్రెయిన్‌లోకి వదలడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి, డ్రెయిన్‌లో కలుషిత నీటిని విడుదల చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు కోరుతున్నారు.


