ఇసుక అక్రమాలు నిల్వరించేదెలా..? | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమాలు నిల్వరించేదెలా..?

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

అదనపు బాదుడు

ఇసుక స్టాక్‌ పాయింట్‌ అడ్డాగా నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. అడ్డగోలుగా ధరలు వసూలు చేస్తూ వినియోగదారులపై భారం మోపుతున్నారు. రూ.4 వేల లోపు ఖర్చయ్యే లోడింగ్‌కు రూ.7 వేలు వసూలు చేస్తున్నారని టిప్పర్‌ అసోసియేషన్‌ నాయకులు అంటున్నారు. దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

సాక్షి, భీమవరం: జిల్లాలో వశిష్ట గోదావరి తీరం వెంబడి సిద్దాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడి ఓపెన్‌ రీచ్‌లు, దొడ్డిపట్ల, అబ్బిరాజుపాలెం, యలమంచిలి లంక, చించినాడ, మాధవాయిపాలెంలోని డీసిల్టేషన్‌ పాయింట్ల ద్వారా గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని కోస్టల్‌ రెగ్యులర్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌)గా ప్రకటించింది. ఉప్పునీటి సాంద్రత వలన ఇక్కడి ఇసుక నిర్మాణాలకు పనికిరాదని ర్యాంపులు మూసివేశారు. జిల్లా అవసరాల నిమిత్తం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని ర్యాంపుల నుంచి ఇసుకను తెస్తున్నారు.

అడ్డగోలుగా దోపిడీ

స్టాక్‌ పాయింట్లలో ఇసుక లేక జిల్లా అవసరాల నిమిత్తం పక్క జిల్లాలోని స్టాక్‌ పాయింట్లకు వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలు చేస్తున్నారని జిల్లాకు చెందిన టిప్పర్‌ లారీ అసోసియేషన్‌ నేతలు అంటున్నారు. ఉచిత ఇసుక పాలసీ మేరకు కేవలం లోడింగ్‌ చార్జీలు మాత్రమే వసూలు చేయాలి. ర్యాంపు వద్ద ఈ ధర 20 టన్నుల లారీకి రూ.2 వేల వరకు ఉంటుంది. స్టాక్‌ పాయింట్‌ వద్ద అయితే ర్యాంపు నుంచి స్టాక్‌ పాయింట్‌కు ఇసుక రవాణా, నిర్వహణ చార్జీలతో రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అసోసియేషన్‌ నాయకులు చెబుతున్నారు. అయితే డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని స్టాక్‌ పాయింట్‌లో ప్రభుత్వం టన్నుకు రూ.310లు చొప్పున అధిక ధరను నిర్ణయించిందని, దీనికి అదనంగా నిర్వాహకులు లారీకి రూ.800లు కలిపి రూ.7 వేలు వసూ లు చేస్తున్నారంటున్నారు. దీంతో లారీకి రూ.3 వేలకు పైగా భారం పడుతోందని తెలిపారు. జిల్లాకు రోజుకు వందకు పైగా లారీలు వస్తుండగా ఈ మేరకు వినియోగదారులపై భారం పడుతోంది. స్టాక్‌ పాయింట్లలో దోపిడీతో జిల్లాలో ఇసుక ధరలకు రెక్కలొచ్చాయని, లారీ ఇసుక పాలకొల్లుకు రూ. 13,200, నరసాపురానికి రూ.14,200, భీమవరానికి రూ.16,200, తాడేపల్లిగూడేనికి రూ.13 వేలు, తణుకుకు రూ.11 వేలు వరకు ధరలు ఉన్నాయంటున్నారు. ధరల నియంత్రణకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో స్టాక్‌ పాయింట్‌ లేకపోవడంతో కోనసీమ జిల్లా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇసుక ఉచితమని చెబుతుంటే అక్కడ లారీకి రూ.7 వేల చొప్పున అడ్డగోలుగా లోడింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ధర మరింత పెంచుతారని తెలుస్తోంది. లారీ కిరాయి కంటే ఇసుక ఖరీదు ఎక్కువగా ఉంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాం.

– రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టిప్పర్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

సైఖతం

అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ఇసుక కొరత

పొరుగు జిల్లాలోని స్టాక్‌ పాయింట్‌లో లారీకి రూ.7 వేల వసూలు

వినియోగదారులపై అదనపు భారం

జిల్లాకు రోజుకు వంద లారీలకు పైగా ఇసుక

ఉన్నతాధికారులకు టిప్పర్‌ లారీ అసోసియేషన్‌ ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement