భీమవరం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన తర్వాత ఎట్టకేలకు సామాజిక పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించింది. పలురకాల కొర్రీలు, ఆంక్షలతో లబ్ధిదారులను ముప్పుతిప్పలు పెట్టింది. తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత వేలాది మందిని అనర్హులుగా తేల్చింది. దీంతో పింఛన్ మంజూరు చేయించుకోవడం కోసం పేదలు ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇదే అదనుగా కొందరు దళారులు పింఛన్లు ఇప్పిస్తామంటూ కౌంటర్లు తెరిచి ముడుపులు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో 20 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ పరిధిలో 49,901 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 6,112 మందిని అధికారులను అనర్హులుగా గుర్తించారు.
ముడుపుల దందా : ప్రభుత్వం విడతల వారీగా పింఛన్లు ఇస్తామని ప్రకటించడంతో మొదటి విడతలో మంజూరు చేయించాలంటూ పేదలు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు కూట మి నాయకులు ముడుపుల దందాకు తెరదీసినట్టు సమాచారం. పింఛన్ మంజూరుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పలువురు ఈ సొమ్ములను వారికి మట్టుజెబుతున్నారు. పింఛన్ల మంజూరు పేరుతో సొమ్ములు వెనకేసుకోవాలనే ప్రయత్నంలో కూట మి నాయకులు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నా యి. అలాగే గ్రామాల్లో పింఛన్ల మంజూరు విషయంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య విభేదాలు లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏఐ సృష్టించిన చిత్రం
పింఛన్ దరఖాస్తుల్లో కోత
జిల్లాలో 6,112 దరఖాస్తుల తిరస్కరణ
ఇదే అదనుగా మంజూరు కోసం మామూళ్ల వసూళ్లు
కౌంటర్లు తెరిచిన కూటమి నేతలు !


