భీమవరం: భీమవరంలో నూతన జిల్లా పరిషత్ కార్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. కలెక్టర్ సీహెచ్ నాగరాణి జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. టూ టౌన్‌లోని పాత బస్టాండ్ వద్ద పంచాయతీరాజ్ కార్యాలయం భవనంలో ఈ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయానికి 30 మంది సిబ్బందిని నియమించామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ భీమవరంలో జెడ్పీ శాశ్వత భవన నిర్మాణానికి మూడు నెలల్లోపు స్థల సేకరణ చేసి శంకుస్థాపన చేయాలన్నారు. ఎమ్మెల్యేలు పులపర్తి రా మాంజనేయులు (అంజిబాబు), పత్సమట్ల ధ ర్మరాజు, భీమవరం ఏఎంసీ చైర్‌పర్సన్ కలిదిండి సుజాత, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: భారీ వర్షాలతో నరసాపురం వశిష్ట గోదావరి పొంగిపొర్లుతోంది. గోదావరి నీటిమట్టం పెరగడంతో నరసాపురం–సఖినేటిపల్లి రేవులో పంటు రాకపోకలను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉభయగోదావరి జిల్లాల వాసులు చించినాడ బ్రిడ్జి మీరుగా చుట్టుతిరిగి రాకపోకలు సాగించాల్సి వచ్చింది. విషయం తెలియక పలువురు రేవు వద్దకు చేరుకుని నిరాశతో వెనుదిరిగారు.
తాడేపల్లిగూడెం: విద్యార్థులు, ఆవిష్కర్తలు వాస్తవ సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక, వినూత్న, విస్తృతస్థాయిలో అమలు చేయగల పరిష్కారాలను అభివృద్ధి చేయాలని బెంగళూరులో శుక్రవారం జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమాన్ని ఏపీ నిట్‌లో ప్రత్యక్ష ప్రసారం చే యగా ఆచార్యులు, విద్యార్థులు వీక్షించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ జోన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఏపీకి జోనల్ హెడ్‌గా ఏపీ నిట్ బాధ్యతలు తీసుకుంది. ఏపీ నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌వీ రమణరావు దక్షిణ జోన్ జూరీ సభ్యులలో ఒకరిగా వ్యవహరిస్తారు. ఏపీ నిట్ ఇన్నోవేషనల్ కౌన్సిల్ డాక్టర్ వి.సందీప్ మాట్లాడుతూ యువతలో సృజనాత్మక ఆలోచనలు, శాసీ్త్రయ దృక్పథం, స మస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే ఆ విష్కరణలను ప్రోత్సహించడానికి ఇలాంటి కా ర్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ జాతీయస్థాయి చాలెంజ్‌లో విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు పాల్గొనవచ్చన్నారు.
పోలవరం రూరల్: గోదావరి వరద ఉధృతంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30 మీటర్ల నీటిమట్టం దాటింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 4.90 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. దిగువన ఉభయగోదావరి జిల్లాల లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉపనదుల నీటితో పాటు శబరి నీరు కూడా నదిలోకి చేరడంతో వరద ఉధృతి పెరుగుతోంది. మరో రెండు రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చాట్రాయి: భారీ వర్షాలతో మండలంలోని తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ఎగువన సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు నుంచి వచ్చే వరద జలాశయానికి చేరుతుందని, సుమారు 1500 క్యూసెక్కుల నీరు వస్తున్నట్టు టీఆర్‌పీ అధికారులు తెలిపారు.


