బుట్టాయగూడెం: మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతంలోని కొండవాగులు పొంగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం వరకూ చింతకొండ, కన్నారప్పాడు, కొవ్వాడ, కేఆర్‌పురం తదితర వాగులు ఉధృతంగానే ప్రవహించాయి. అలాగే జల్లేరు జలాశయం, పోగొండ రిజర్వాయర్‌తోపాటు చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. భారీ వర్షాలకు దొరమామిడి ఎస్సీకాలనీకి చెందిన పూసంపూడి దుర్గమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. అధికారులు ఆదుకోవాలని ఆమె కోరుతోంది.
గిరిజనుడి మృతదేహం లభ్యం
కేఆర్‌పురం సమీపంలోని తూర్పు కాల్వ వాగులో గురువారం రాత్రి గల్లంతైన గిరిజనుడు పూనెం భాస్కరరావు (60) మృతి చెందాడు. గాలింపు చర్యలు ముమ్మరంగా జరిగాయి. యర్రాయిగూడెం గ్రామశివారు గుడి సమీపంలోని తుప్పల్లో భాస్కరరావు మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్తులు మృతదేహాన్ని బయటకు తీసి జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.


