పదవుల కోసం పోటీ
భీమవరం(ప్రకాశం చౌక్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పాలనా సౌల భ్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లాల పునర్విభజన చేపట్టి, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏ డు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లాను ఏర్పాటుచేశారు. నాడు అన్ని రాజకీయ పక్షాల నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏలూరులోని కలెక్టరేట్, జిల్లాపరిషత్, అర్బన్ డెవలప్‌మెంట్ కా ర్యాలయాలకు దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లే శ్రమ లేకుండా, స్థానికంగానే సేవలు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కింది. జిల్లా ఏ ర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో ఇటీవల ప్రభుత్వం నూతనంగా జిల్లా పరిషత్తో పాటు భీ మవరం కేంద్రంగా భీమా ఊడా (భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాపరిషత్ కా ర్యాలయం ప్రారంభం కాగా, త్వరలోనే భీమా ఊ డా కార్యాలయాన్ని కూడా భీమవరంలో ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా జిల్లా ప్రజలకు రాజకీయంగా, పరిపాలనాపరంగా సేవలు మరింత సులభంగా లభిస్తాయి.
అందుబాటులోకి కీలక పదవులు
జిల్లాపరిషత్ (జెడ్పీ) చైర్మన్ : ఇప్పటివరకు నూతన పశ్చిమగోదావరి జిల్లాకు ప్రత్యేకంగా జెడ్పీ లేకపోవడంతో, ఉమ్మడి జిల్లా పరిధిలోనే జెడ్పీ నిర్వహణ సాగింది. నూతనంగా ఏర్పడిన 19 మండలాల జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత జెడ్పీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ పదవిని కై వసం చేసుకోవాలని అన్ని పార్టీలూ
ఆశిస్తున్నాయి.
భీమా ఊడా చైర్మన్ : ఇప్పటివరకు ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ప్రాంతాలను వేరు చేస్తూ ప్రత్యేకంగా భీమా ఊడాను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జిల్లాస్థాయి ప్రాధాన్యత ఉన్న ఈ పదవి కోసం కూడా అధికార పార్టీ నాయకులలో తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ముఖ్యమంతిర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు నూతన జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే జెడ్పీ, ఊడా వంటి కీలక పదవులు అందుబాటులోకి వచ్చాయని అధికార పార్టీ నాయకులు సైతం చర్చించుకుంటున్నారు.
అధికారుల నియామకం.. ప్రజలకు విస్తృత సేవలు:
రెండు కీలక శాఖల ఏర్పాటుతో జిల్లాకు ముగ్గురు ఉన్నతాధికారులు రానున్నారు. ఒకరు జెడ్పీ సీఈ ఓ కాగా, మరొకరు భీమా ఊడా ప్లానింగ్ అధికారి. వీరు జిల్లా స్థాయిలో ఉంటూ ప్రజలకు అవసరమైన అభివృద్ధి, పరిపాలనా సేవలను నిరంతరం అందిస్తారు. మొత్తం మీద నూతన జిల్లా ఏర్పాటుతో భీమవరం కేంద్రంగా పరిపాలన ప్రజలకు మరింత చేరువైంది.
ఈ రెండు పదవుల కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇప్పటినుంచే అధిష్టానాల వద్ద ప్రయత్నాలు ప్రారంభించారు. భీమా ఊడా నామినేటెడ్ పోస్టు కావడంతో దానిని తమకే కేటాయించాలని బీజేపీ, జనసేన నాయకులు పట్టుబడుతుండగా, టీడీపీ నేతలు కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు జెడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే ముందుగా జెడ్పీటీసీగా గెలవాల్సి ఉన్నందున, ఆ దిశగా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు సాధిస్తే ఆ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది.
జిల్లాపరిషత్, భీమా ఉడాతో పదవులు, ఉన్నతాధికారులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్విభజన
భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి
ఇన్నాళ్లకు జెడ్పీ, భీమా ఉడా ఏర్పాటు


