● కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి
● ఐదుగురికి తీవ్రగాయాలు
నూజివీడు : పాత కక్షల నేపథ్యంలో వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బాపూనగర్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఊరేగింపు మున్సిపల్ కార్యాలయం వరకు వెళ్లి తిరిగి వస్తుండగా, రాత్రి 10 గంటల సమయంలో దేరంగుల సత్యనారాయణ, దేరంగుల వెంకటేశ్వరరావు, చంద్రగిరి గంగాధరరావులతో పాటు మరికొందరు కర్రలు, కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రేపాని రాజు (30), అచ్చి బాల ఏసు (29), గుత్తి గోపాలకృష్ణ (28), రేపాని సాయి (24), గుత్తి భవానీ (45)లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు, తమపై అచ్చి బాల ఏసు సహా మరికొందరు కర్రలు, కత్తులతో దాడి చేయడంతో ఐదుగురం గాయపడ్డామని రెండో వర్గానికి చెందిన దేరంగుల వెంకటేశ్వరరావు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘర్షణ సమాచారం అందుకున్న ఎస్సైలు ఎన్.లక్ష్మణ్‌బాబు, జి.జ్యోతీబసు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై లక్ష్మణ్‌బాబు తెలిపారు.


