ఉండి: రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి ఉండి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పీ గీతిక, బీ మహేష్, ఈ మహేంద్ర ఎంపికై నట్లు హెచ్‌ఎం వై.రామలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగిలో బుధవారం జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే పోటీల్లో వీరు ఎంపికై నట్లు ఆమె వెల్లడించారు. ఈ విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్, పీడీ జే. శ్రీనివాస్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఈ విద్యార్థులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
ద్వారకాతిరుమల: ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పు చెల్లించలేక ఓ కూలీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై స్థానిక పోలీస్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. మండలంలోని దేవినేనివారిగూడెంకు చెందిన పెండెల నాగరాజు(41) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో ఫైనాన్స్‌లో రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించలేకపోవడంతో ఒత్తిడి పెరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద నాగరాజు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య పెండెల వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డీబీఆర్‌సీ) ఆధ్వర్యంలో స్థానిక సీఐటీయూ భవనం హాల్‌లో నిరుద్యోగ యువత కోసం కెరీర్ మార్గదర్శకత్వం, ఉపాధి నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. రిసోర్స్ పర్సన్, సీడాప్ ప్రతినిధి వీ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్, డిజిటల్, వ్యక్తిగత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నర్సింగ్, అనుబంధ వైద్య రంగాల్లో దేశ విదేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో నర్సింగ్ వృత్తికి అధిక డిమాండ్ ఉందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు నర్సింగ్ కోర్సులు అభ్యసించాలని సూచించారు. విదేశీ భాషలపై పట్టు సాధించడం ద్వారా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. గోశాల ఝాన్సీ మాట్లాడారు. డీబీఆర్సీ ఏరియా కోఆర్డినేటర్ బలే సురేష్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ యువత సాధికారత కోసం విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, కెరీర్ మార్గదర్శకత్వ కార్యక్రమాలను డీబీఆర్సీ నిరంతరం కొనసాగిస్తుందన్నారు. జిల్లాకు చెందిన సుమారు 40 మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


