భీమవరం (ప్రకాశంచౌక్): బాలల సంక్షేమం, రక్షణ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని, పథకాలను క్షేత్రస్థాయిలో పిల్లలకు అందేలా చూడాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమం, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, పోషణ, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, డ్రాప్ అవుట్స్ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాలలపై ఎలాంటి హింస, వేధింపులు, నిర్లక్ష్యం, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు చోటుచేసుకోకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పాఠశాలలకు దూరంగా ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బాలల రక్షణ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. సభ్యు లు మండల గంగ సూర్యనారాయణ, డా.పి.నాగ మానస, డీఆర్వో పి.గ్లోరియా, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి డి.శ్రీలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి శేఖర్, అధికారులు పాల్గొన్నారు.


