27న బధిర సంఘ జిల్లా సమావేశం | - | Sakshi
Sakshi News home page

27న బధిర సంఘ జిల్లా సమావేశం

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

27న బధిర సంఘ జిల్లా సమావేశం విజిలెన్స్‌ కమిటీ సభ్యుడిగా బంగారయ్య లంచం కేసులో అధికారికి రెండేళ్ల జైలు శిక్ష తెరుచుకున్న ఉండి రైల్వే గేటు పెరటిలో కూరగాయలు పెంచుకోవాలి

భీమవరం: బధిర అసోసియేషన్‌ జిల్లాస్థాయి వార్షిక సమావేశం ఈనెల 27వ తేదీన పట్టణంలోని డీఎన్నార్‌ కళాశాల రామకృష్ణ సభాభవనంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు చెరుకువాడ రంగసాయి చెప్పారు. మంగళవారం భీమవరంలో నిర్వహించిన అసోసియేషన్‌ సమీక్ష సమావేశంలో వార్షికోత్సవ బ్రోచర్‌ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. గన్నాబత్తుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశంలో సంఘ సభ్యులంతా హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ టి రాము, వైస్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ తాతారావు, ఎన్‌ జెన్నీ, గాదిరాజు రామచంద్రరాజు పాల్గొన్నారు.

ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లా వినియోగదారుల సంఘ అధ్యక్షుడు బొబ్బిలి బంగారయ్యను పౌరసరఫరాల శాఖ రాష్ట్ర విజిలెన్స్‌ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కె. కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలులో అవకతవకలు చోటు చేసుకున్నా లేదా ఎవరైనా అవినీతికి పాల్పడినా ఆ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందని బంగారయ్య మంగళవారం విలేకర్లతో తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ దర్శి వంశీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, లయన్స్‌ మాజీ జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ ఎంవీ సూర్యనారాయణరాజు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఏలూరు టౌన్‌: విధుల్లో ఉంటూ అవినీతికి పాల్పడిన కేసులో భీమవరం ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ (డీఈ) గుంజ ఆనంద్‌బాబుకు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపారు.

కేసు వివరాలు

2011లో భీమవరం ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈగా పనిచేస్తున్న ఆనంద్‌బాబు... అప్పటి పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్‌ అనే కాంట్రాక్టర్‌ బిల్లుల మంజూరు నిమిత్తం రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. దీంతో బాధితుడు దాసరి శ్రీనివాస్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 2011 నవంబర్‌ 5న ముద్దాయి ఆనంద్‌బాబు బాధితుడి నుంచి లంచం సొమ్ము తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ పూర్తి కాగా, నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున ఏలూరు రేంజ్‌ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి. వెంకటరత్నంబాబు వాదనలు వినిపించగా... ఏలూరు రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు, ఇన్‌స్పెక్టర్‌ ఎం.బాలకృష్ణ ప్రాసిక్యూషన్‌కు సహకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఉండి: రోడ్డు ఓవర్‌ బ్రిడ్జ్‌ నిర్మాణంలో భాగంగా ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు మూసివేసిన ఉండి రైల్వే గేటును మంగళవారం సాయంత్రం రైల్వే అధికారులు తిరిగి తెరిచారు. దీంతో బుధవారం నుంచి జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలకు పూర్తిస్థాయిలో అవకాశం లభించనుంది. రైల్వే గేటు తెరిచిన సమాచారం తెలుసుకున్న వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఉండి నుంచి ఆకివీడు వైపు వెళ్లే వాహనదారులు వారం రోజుల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉండి నుంచి వాండ్రం, ఉప్పుగుంట, పాములపర్రు మీదుగా వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, ఆ రోడ్లు దారుణంగా ఉండటంతో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా మరోసారి రైల్వే గేటు మూసివేయాల్సిన పరిస్థితి వస్తే, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆకివీడు వైపు వెళ్లే దారులను ప్రభుత్వం వెంటనే బాగు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.

తాడేపల్లిగూడెం: వాతావరణ అనుకూల పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పెరటిలో కూరగాయలు పెంచుకోవాలని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు పిలుపునిచ్చారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో మంగళవారం ముగిసిన పుట్టగొడుగుల శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వయంగా కూరగాయలు పండించడం వంటి విస్తరణ కార్యక్రమాలపై కేవీకే హెడ్‌ సీహెచ్‌ కిరణ్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి వెయ్యి కుటుంబాలకు ఉచితంగా 16 రకాల కూరగాయల విత్తనాల సంచులను అందజేయనున్నట్లు తెలిపారు. మూడు రోజులపాటు శిక్షణ పొందిన వారు పుట్టగొడుగుల పెంపకం చేపట్టి, తమ కుటుంబాలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన వారికి కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ విస్తరణ సంచాలకులు సీహెచ్‌ రూత్‌, ఇ.పద్మ, కేవీకే సైంటిస్టులు ఏ.దేవీవరప్రసాదరెడ్డి, ఇ.రేఖ, కె.అర్చన పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement