పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగి గల్లంతు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

పుష్కర ఘాట్‌ వద్ద స్నానానికి దిగి గల్లంతు మేలు జాతి గోవులకూ బ్రూసెల్లా

కుక్కునూరు: కుక్కునూరు మండలం పెద్దరావిగూడెంలోని పుష్కర ఘాట్‌ వద్ద గోదావరిలో స్నానానికి దిగిన వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పోలవరం మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తూము రాజేష్‌ (43) సోమవారం పెద్దరావిగూడెంలోని శివాలయ దర్శనం కోసం వచ్చాడు. అనంతరం పుష్కర ఘాట్‌లో గోదావరి స్నానానికి దిగి నది ప్రవాహంలో గల్లంతయ్యాడు. గుడికి వెళ్లిన రాజేష్‌ సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, గోదావరి ఒడ్డున అతనికి చెందిన కారు, చెప్పులు కనిపించాయి. వెంటనే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా, రాజేష్‌ మృతదేహం మంగళవారం మధ్యాహ్నం తోటపల్లి గ్రామం సమీపంలో లభ్యమైంది.

ముందే హెచ్చరించిన ‘సాక్షి’

గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో సందర్శకులు గోదావరిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ‘పుష్కర ఘాట్‌ వద్ద ప్రమాదఘంటికలు‘ శీర్షికన కథనాన్ని ప్రచురించి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అయినా అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు వ్యక్తులు గోదావరిలో గల్లంతై మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు స్పందించి పుష్కర ఘాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రాణనష్టాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.

ద్వారకాతిరుమల: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రంలోని గోసంరక్షణశాలలో కలకలం రేపిన బ్రూసెల్లోసిస్‌ (బ్రూసెల్లా) వ్యాధి మేలుజాతి ఆవులకు సైతం సోకింది. మొత్తం 10 జాతులకు చెందిన 358 ఆవులను దేవస్థానం సంరక్షిస్తోంది. వీటిలో 71 ఆవులకు వ్యాధి నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీటిలో గిర్‌ జాతి ఆవులు 21, కాంక్రీజ్‌ జాతి ఆవులు 3, ఒంగోలు జాతి ఆవులు 13, నిమారి జాతి ఆవు 1, దేశవాళి, కపిల జాతి ఆవులు, గిత్తలు 24, జెర్సీ ఆవులు 9 ఉన్నాయి. ఈ విషయాన్ని దేవస్థానం ఈఓ త్రినాథరావు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌కు తెలియజేసినట్టు సమాచారం. ద్వారకాతిరుమల తరువాత ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను తిరుమల తిరుపతి దేవస్థానం గోసంరక్షణశాలలో నిర్వహించగా, దాదాపు 6 వందల గోవులకు ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలకు చెందిన గోసంరక్షణ శాలల్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపిస్తే మంచిదని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

సర్వత్రా చర్చనీయాంశం

శ్రీవారి గోసంరక్షణశాలలో 71 గోవులకు బ్రూసెల్లా వ్యాధి సోకడం, అధికారులు చేపడుతున్న నియంత్రణ, సంరక్షణ చర్యలు, వ్యాధి వ్యాప్తితో కలిగే అనర్థాలను వివరిస్తూ మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘గోవులకు గర్భశోకం’ కథనం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండల పశువైద్యాధికారి సురేష్‌ దీనిపై ఉన్నతాధికారులకు తగు వివరణ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement