లింగపాలెం: నకిలీ మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేసి తమను మోసం చేసిన ఆర్గనైజర్‌పై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు సోమవారం ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం లింగపాలెం మండల కార్యదర్శి ఆచంట నాగేశ్వరరావు, బాధితులు మద్దిపాటి వెంకటేశ్వరరావు, బొంతు లింగారావు, బొంతు సుధాకర్ తదితరులు మాట్లాడుతూ... 2024 రబీ సీజన్‌లో పొన్నుగంటి వీరభద్రరావు అనే సీపీ కంపెనీ ఆర్గనైజర్ ద్వారా వెంకటాపురం గ్రామానికి చెందిన 22 మంది రైతులు 80 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనాలు వేశారని తెలిపారు. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడి వస్తుందని ఆర్గనైజర్ నమ్మబలకడంతోనే పంట సాగు చేశామన్నారు. అయితే, ఎంత పెట్టుబడి పెట్టినా పైరు సరిగ్గా ఎదగలేదని, కంకులు పాలుపోసుకోక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎకరానికి రూ.లక్ష నష్టం
ఎకరానికి రూ.లక్ష చొప్పున నష్టం వాటిల్లడంతో ఆర్గనైజర్‌ను నిలదీయగా... కంపెనీ వాళ్లతో మాట్లాడిస్తానని చెప్పి కాలయాపన చేశాడని, చివరకు వ్యవసాయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన పరిష్కారం లభించలేదని వాపోయారు. విచారణ నిమిత్తం 20 మంది రైతులం పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, కేవలం ఒక్కరినే విచారించి మిగతా వారిని బయటకు పంపించివేశారని వారు ఆరోపించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సదరు సీపీ కంపెనీ ఆర్గనైజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు.


