రెండు రోజులపాటు..
శివారు రైతులకు ఊరట
సాక్షి, భీమవరం: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లా అంతటా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిస్తున్నాయి. ఉద్యాన, తొలకరి పంటలకు మేలు చేస్తున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోతల నుంచి జనజీవనానికి ఉపశమనం లభించింది. ఎల్‌నినో కారణంగా గత మూడు నెలల్లో తీవ్ర వర్షాభావంతో 343.4 మి.మీ లోటు వర్షపాతం నమోదైంది.
తీవ్ర వర్షాభావం
రుతుపవనాలు సకాలంలోనే వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ నెలలో జిల్లాలో సగటు సాధారణ వర్షపాతం 110.4 మి.మీ కాగా 61.8 మి.మీ మాత్రమే కురిసింది. 49.4 మి.మీ లోటు నమోదైంది. జూలైలో 245.6 మి.మీలకు గాను కురిసింది కేవలం 85.6 మి.మీ కావడంతో 160 మి.మీ లోటు ఉంది. ఆగస్టులో 250 మి.మీలకు 116 మి.మీ కురవడంతో 134 మి.మీ లోటు ఉంది. జూన్, జూలై నెలల్లో నరసాపురం, ఉండి, పాలకోడేరు, మొగల్తూరు, పాలకొల్లు, వీరవాసరం, పోడూరు, ఆచంట, పెనుమంట్ర, ఆకివీడు, గణపవరం మండలాల్లో రెండు మూడు రోజు లు అడపాదడపా జల్లులతో కూడిన వర్షం కురవగా ఎనిమిది మండలాల్లో ఒక్కరోజు కూడా వర్షం పడని పరిస్థితి. జిల్లాలోని 20 మండలాల్లోను గత మూడు నెలల్లో 343.4 మి.మీ లోటుతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
పంటలపై ప్రభావం
జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. మరోపక్క 47,572 ఎకరాల్లో కూరగాయలు, కొబ్బరి, అరటి, కోకో, ఆయిల్‌పామ్, మామిడి, జామ తదితర ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. నవంబరు చివరిలో వచ్చే తుపానుల బారిన పడకుండా ముందుగానే పంటను ఒబ్బిడి చేసుకునేందుకు జూలై 15లోగా నాట్లు పూర్తిచేయాలి. వర్షాలు కురవకపోవడం, శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి సమస్యతో నాట్లు ఆలస్యమయ్యాయి. నారుమడులకు నీటికోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పోడూరు, యలమంచిలి తదితర మండలాల్లో సాగునీటి సమస్యపై రైతులు పీజీఆర్‌ఎస్‌లో సైతం ఫిర్యాదులు చేశారు. ప్రతికూల వాతావరణంతో పంట తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయి. మ రోపక్క పంచాయతీల్లో మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటి గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. వేసవిని తలపిస్తూ ఎండలు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకో..!
అల్పపీడనంతో జిల్లా అంతటా వర్షం
ఉదయం 8 గంటలకు 46.2 మి.మీ. వర్షపాతం నమోదు
ఖరీఫ్, ఉద్యాన పంటలకు ఊపిరి
ఎల్‌నినోతో మూడు నెలలుగా జాడలేని వానలు
343.4 మి.మీ. లోటు వర్షపాతం నమోదు
జిల్లాలోని 2.08 లక్షల ఎకరాల్లో తొలకరి సాగు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8 గంటల సమయానికి జిల్లా అంతటా 923 మి.మీ. వర్షం కురవగా సగటు వర్షపాతం 46.2 మి.మీగా నమోదైంది. అత్యధికంగా పెనుగొండలో 108 మి.మీ వర్షం కురవగా ఇరగవరంలో 107 మి.మీ, పెనుమంట్రలో 104 మి.మీ, గణపవరం, ఆచంట మండలాల్లో 97 మి.మీ చొప్పున, పోడూరులో 66 మి.మీ, అత్తిలిలో 51 మి.మీ, మిగిలిన మండలాల్లో 50 మి.మీ లోపు వర్షం కురిసింది. అత్యల్పంగా తాడేపల్లిగూడెంలో 8.2 మి.మీ, మొగల్తూరులో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ లెక్కలు ప్రకారం మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయి. కొద్దిరోజులగా తీవ్ర ఎండ, వేడి వాతావరణంతో అవస్థలు పడుతున్న జనానికి ప్రస్తుత వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.
సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ వర్షాలు శివారు ప్రాంత రైతులకు ఊరటనిస్తున్నాయి. ముందుగా నాట్లు వేసిన తాడేపల్లిగూడెం రూరల్‌లో ప్రస్తుతం పంట పాలుపోసుకునే దశలో ఉండగా పనులు ఆలస్యమైన యలమంచిలి, నరసాపురం రూరల్ తదితర ప్రాంతాల్లో పిలకలు వేసే దశలో ఉన్నాయి. వరితో పాటు లంకల్లోని దాదాపు 3,190 ఎకరాల్లోని కూరగాయలు, 2,900 ఎకరాల్లోని అరటి, జామ పంటలకు ప్రస్తుత వర్షాలు మేలు చేస్తాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు.


