భీమవరం : భీమవరంలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఏ కోర్టు కేసులు ఆ కోర్టులోనే పరిష్కరించుకునేలా మొత్తం 5 బెంచ్ లను ఏర్పాటు చేశారు. 3వ అదనపు జిల్లా కోర్టు కేసులను పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ డాక్టర్ బి.లక్ష్మీనారాయణ పరిష్కరించారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను న్యాయమూర్తి ఎం.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కేసులను న్యాయమూర్తి సి.రమ్య పరిష్కరించారు. 1వ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టు కేసులను న్యాయమూర్తి పి.హనీష, 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కేసులను న్యాయమూర్తి ఎన్.జ్యోతి రాజీ చేశారు. లోక్ అదాలత్ బెంచ్ లకు న్యాయవాది సభ్యునిగా కల్పన, జోసఫ్, సుబ్బారాయుడు, రామ్మూర్తి (సాయి), మల్లేశ్వరరావు వ్యవహరించారు. మొత్తంగా 421 కేసులు రాజీ చేయగా వీటిలో సివిల్ 33, క్రిమినల్ 355, బ్యాంకు, మొండి బాకీ కేసులు 33 ఉన్నాయి. సుమారు రూ.3.55 కోట్ల విలువైన కేసులను రాజీ చేసి కక్షిదారులకు ఇప్పించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యేలేటి న్యూటన్, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


