తణుకు అర్బన్: చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో, మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన నంబూరి పద్మిని (40) చివరకు సోమవారం మృతి చెందారు. ఈనెల 5వ తేదీన తణుకు పట్టణానికి చెందిన పాల వ్యాపారి కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో, పద్మినిని జాలర్లు రక్షించగా ఆమె ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో నంబూరి శ్రీనివాస్, కుమారుడు ఈశ్వర్, కుమార్తె నిత్యశ్రీల మృతదేహాలు ఆదివారం లభ్యమైన విషయం తెలిసిందే. పద్మినికి శనివారం పాలకొల్లు, తణుకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రథమ చికిత్స అందించినా, మెరుగైన వైద్యం కోసం అదేరోజు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతూనే ఉన్నప్పటికీ, ఆమె బతుకుతారని ఆశించిన బంధువులకు నిరాశే మిగిలింది. ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు మృతి చెందడంతో బంధువర్గంలో విషాదఛాయలు అలముకున్నాయి.


