● వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న నరసింహ గురూజీ
● నేడు పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో దివ్య పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం నిర్వహిస్తున్న ఈ పవిత్రోత్సవాలు స్వామివారి కీర్తిని, వైభవాన్ని మరింతగా చాటనున్నాయి. ఆలయ యాగశాలలో వేద పండితులు, అర్చకులు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, అఖండ దీపస్థాపన, దీక్షాధారణ, పంచగవ్య ప్రాశన, పంచగవ్య ప్రోక్షణ, అగ్ని ప్రతిష్ఠాపన, వాస్తు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ అంకురార్పణ చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. విహిత దేవత మండప ఆరాధనలు, పవిత్రాభిమన్త్రణ, మూల మంత్ర హోమాలు, అధివాసములు, నీరాజన మంత్రపుష్పములు, బలిహరణలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొని, పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


