ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇలా..
రోజూవారీ జీవనంలో ఇవి తప్పనిసరి
ఫిజియోథెరపీ తప్పనిసరి
● మారిన జీవన శైలితో పెరుగుతున్న మెడ, నడుము, మోకాళ్ల నొప్పులు
● మందులకు తోడు ఫిజియోతో మేలు
● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ డే
ద్వారకాతిరుమల: మారుతున్న జీవనశైలి.. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం.. మొబైల్ వినియోగం పెరగడం.. శారీరక శ్రమ తగ్గిపోవడం.. ప్రయాణాల్లోనూ నడకకు దూరమవడం.. ఇవన్నీ కలిసి చిన్న వయసులోనే మెడ, వెన్ను, భుజాలు, మోకాళ్లు, కీళ్ల నొప్పులకు కారణమవుతున్నాయి. కదలికలు తగ్గిపోవడంతో కండరాల బలం తగ్గడం, శరీర బరువు పెరగడం, కీళ్లపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. శారీరక చురుకుదనం లేకపోవడం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్–2 మధుమేహం వంటి అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొంటోంది.
ఫిజియోథెరపీతో మళ్లీ బలం
నొప్పి వచ్చిన ప్రతిసారీ మందులు వేసుకోవడం లేదా పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని వైద్యులు సూచిస్తున్నారు. సమస్యకు కారణాన్ని గుర్తించి, కండరాలు–కీళ్ల కదలికలను మెరుగుపరిచేలా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఫిజియోథెరపీ చేయించుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఫిజియోథెరపీలో స్ట్రెచింగ్, కండరాల బలోపేత వ్యాయామాలు, జాయింట్ మొబిలిటీ వ్యాయామాలు, బ్యాలెన్స్ ట్రైనింగ్, నడక శిక్షణ వంటి విధానాలను రోగి పరిస్థితిని బట్టి ఉపయోగిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం నొప్పిని మాత్రమే తగ్గించడం కాకుండా.. శరీర కదలికలు, కండరాల బలం, సమతుల్యత, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరచడం.
శస్త్రచికిత్స తర్వాత ఫిజియోనే కీలకం
మోకాలి మార్పిడి, హిప్ రీప్లేస్‌మెంట్, ఎముకల శస్త్రచికిత్సలు, వెన్నెముక సంబంధిత ఆపరేషన్లు, లిగమెంట్ లేదా కండరాల శస్త్రచికిత్సల తర్వాత ఫిజియోథెరపీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆపరేషనన్ పూర్తయిందంటే చికిత్స ముగిసినట్లు కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స తర్వాత క్రమంగా కదలికలను పెంచడం, కండరాల బలాన్ని తిరిగి సాధించడం, నడకను మెరుగుపరచడం, రోజువారీ పనులకు తిరిగి అలవాటు పడటం వంటి అంశాల్లో పునరావాస చికిత్స కీలకం. అయితే శస్త్రచికిత్స తర్వాత ఏ వ్యాయామం చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎంత తీవ్రతతో చేయాలి అనే విషయాలను రోగి స్వయంగా నిర్ణయించుకోకూడదు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడు, ఫిజియోథెరపిస్ట్ సూచనల మేరకు వ్యాయామాలు చేయాలి.
ఏలూరు జిల్లాలో కై కలూరు, దెందులూరు, పోలవరం, బుట్టాయిగూడెం, భీమడోలు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఫిజియోథెరపీ పరికరాలు కేటాయించినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెల్లడిస్తోంది. ద్వారకాతిరుమల విర్డ్ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఏరియా ఆస్పత్రుల్లో పక్షవాతం, ఆర్థోపెడిక్ కేసుల పునరావాసానికి ఫిజియోథెరపీ సేవలు అందుతున్నాయి.
గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవాలి.
మొబైల్, కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు సరైన భంగిమ పాటించాలి.
వయస్సు, ఆరోగ్య పరిస్థితికి తగిన శారీరక శ్రమను పెంచాలి.
అధిక బరువును నియంత్రించుకోవాలి.
నొప్పి పదేపదే వస్తే వైద్యులను సంప్రదించి కారణాలను తెలుసుకోవాలి.
శస్త్రచికిత్స తర్వాత సూచించిన ఫిజియోథెరపీని మధ్యలో ఆపకుండా పూర్తి చేయాలి.
ప్రస్తుత జీవనశైలిలో శారీరక చురుకుదనం తగ్గిపోవడంతో యువత నుంచి వృద్ధుల వరకు భుజం, మెడ, నడుము, మోకాళ్ల నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలతో ఫిజియోథెరపీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ కొంత సమయం వాకింగ్, తగిన వ్యాయామాలు చేయడం అలవాటుగా మార్చుకోవాలి. శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడం ద్వారా కండరాలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు అనేక నొప్పి సమస్యలను నివారించవచ్చు.
–బి.సాయిసుచరిత, ఫిజియోథెరపిస్ట్, విర్డ్ హాస్పిటల్, ద్వారకాతిరుమల


