భీమవరం: జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా జి.సునీత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరులోని వ్యవ సాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, సాంకేతిక సలహాలు సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ కె.ధనుంజయరావు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో అత్యంత స్వతంత్ర గౌరవ పురస్కారాల్లో ఒకటైన ఈ అవార్డు వీసీకి ఇవ్వనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఉద్యాన వర్సిటీ పరిధిలో ఓనిపెంట కేవీకే ద్వారా మెట్ట ప్రాంత రైతులకు ఉద్యాన పంటల సాగులో అందించిన శాసీ్త్రయ సహకారం, సాంకేతిక పరిజ్ఞానం, రైతుల జీవనోపాధి మెరుగుదలకు చేసిన కృషికి గుర్తింపుగా అవార్డును ఇవ్వనున్నారు. 109వ స్కోచ్ సమ్మిట్‌లో భాగంగా ఈనెల 26న ఢిల్లీలో జరిగే వేడుకల్లో పురస్కారం అందించనున్నారు. వీసీకి పలువురు అభినందనలు తెలిపారు.


