తాడేపల్లిగూడెం: నటులు రాజీవ్ కనకాల, ప్రముఖ హాస్య నటుడు కృష్ణభగవాన్, సీరియల్ నటుడు రవి తదితరులు నటిస్తున్న చిత్ర బృందం సోమవారం పట్టణంలో సందడి చేసింది. గత కొన్ని రోజులుగా ఈ బృందం ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తోంది. తాజాగా సోమవారం జూబ్లీ రోడ్డులో రాజీవ్ కనకాల పాల్గొన్న పలు కీలక సన్నివేశాలను చిత్ర బృందం తెరకెక్కించింది. సెంట్రల్ బ్యాంకు ఎదురుగా ఉన్న ఒక ఫొటోస్టాట్ సెంటర్‌లో, అలాగే జెడ్పీ హైస్కూల్ వద్ద ఈ షూటింగ్ కొనసాగింది. నటులను చూసేందుకు, షూటింగ్ తిలకించేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు.
భీమవరం: విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి అన్నారు. ఇటీవల మృతిచెందిన ఇద్దరు పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ నిధుల నుంచి మంజూరైన చెక్కులను సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అందజేశారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్వీవీఎస్ కృష్ణారావు గత జూలై 9వ తేదీన మరణించగా, ఆయన సతీమణి సుంకర సత్యదుర్గకు విడో వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన రూ.1 లక్ష చెక్కును ఎస్పీ అందజేశారు. అలాగే, పెదవేగి డీటీసీలో విధులు నిర్వహిస్తూ ఆగస్టు 7వ తేదీన మృతిచెందిన జి. విజయకృష్ణ భార్య జి. ఉషకు డిసీజ్డ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కును అందజేసి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు.


