వీరవాసరం : హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుల్ ఆర్‌పీసీ 2386 శీలబోయిన వెంకట సత్యప్రసాద్ అద్భుత ప్రతిభ కనబరిచారు. 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌ను ఆయన 3 గంటల 46 నిమిషాల్లో పూర్తి చేసి ఫినిషర్ పతకాన్ని సాధించారు. ఈ మారథాన్‌లో 10 కేఎం, 21.1 కేఎం, 42.2 కేఎం విభాగాల్లో అంతర్జాతీయ రన్నర్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 32 వేల మంది పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన మారథాన్‌లో ఈ దూరాన్ని 4 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేసిన సత్యప్రసాద్, ఈసారి మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తూ కేవలం 3 గంటల 46 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. తన టైమింగ్‌ను మెరుగుపరుచుకుని మారథాన్ విజయవంతంగా పూర్తి చేసిన కానిస్టేబుల్ సత్యప్రసాద్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీమ్ అష్మి సోమవారం ప్రత్యేకంగా అభినందించినట్లు సత్యప్రసాద్ తెలిపారు.


