ఆస్పత్రికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రికి వెళ్లి వస్తూ.. అనంత లోకాలకు

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

కారు ఢీకొని బాలుడి దుర్మరణం

తండ్రికి గాయాలు

ఆకివీడు: ఏలూరు జిల్లా కై కలూరు శివారు వడ్డిగూడెంకు చెందిన కొల్లేపర పవన్‌కుమార్‌, ఆయన రెండవ కుమారుడు జ్ఞానేశ్వర్‌ (5) జ్వరంతో బాధపడుతుండగా సోమవారం ద్విచక్ర వాహనంపై ఆకివీడు వచ్చి, స్థానిక పిల్లల ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా, జాతీయ రహదారిపై దుంపగడప గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌పై నుంచి తండ్రీకొడుకులు రోడ్డుపై పడిపోయారు. బాలుడు జ్ఞానేశ్వర్‌కు తలపై తీవ్ర గాయమవ్వడంతో వెంటనే స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర గాయాలైన తండ్రి పవన్‌కుమార్‌ స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు చేతి మోచేయి భాగం వెనుకవైపు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సీహెచ్‌సీలోని మార్చురీకి తరలించారు. మంగళవారం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సై శుభశేఖర్‌, సీఐ కాళీచరణ్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తల్లడిల్లుతున్న అమ్మ, అన్న

జ్వరంతో బాధపడుతున్న జ్ఞానేశ్వర్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుని వస్తానని చెప్పి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తల్లి, అన్న కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో తెలివిగా, చలాకీగా తిరిగే తన కుమారుడు విగతజీవుడిగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement