సద్వినియోగం చేసుకోవాలి
● ఎన్‌సీఎస్సీ పోటీలకు దరఖాస్తుల స్వీకరణ
● ఈనెల 31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
● 10–17 ఏళ్లలోపు బాలశాస్త్రవేత్తలకు అవకాశం
నిడమర్రు: పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచలను పెంచేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ (ఎన్‌సీఎస్సీ) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లుగా నిలిపేసిన ఈ కార్యక్రమాన్ని 2026–27 విద్యా సంవత్సరంలో పునః ప్రారంభించారు. జాతీయ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రేరణ సహకారంతో రాష్ట్ర సాంకేతిక మండలి, విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చదివే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్ధులు ఈ పోటీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐదు అంశాల్లో ఈ పోటీలు
2026–27 సంవత్సరంలో ప్రధాన అంశంగా సుస్థిర అభివృద్ధి కోసం విజ్ఞానం, ఆవిష్కరణలు రూపొందించాలి. దీనిలో 5 ఉప అంశాలుగా.. వ్యర్థాల నిర్వహణ కోసం 5 ఆర్ సూత్రాలు, శక్తి కోసం 4 ఈ సూత్రం, నీటి నిర్వహణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర అభివృద్ధి కోసం జాతీయ జ్ఞాన వ్యవస్థల వినియోగం. వీటిలో విద్యార్ధులు తమ ప్రాజెక్ట్ కూపొందించేందుకు ప్రధాన అంశం, ఉప అంశాల్లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. ఎంచుకున్న అంశం సామాజిక ప్రాధాన్యం, చూపిన పరిష్కారం, విజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఉండాలి. అలాగే ఆ ప్రాజెక్ట్ స్థానిక విషయమై ఉండాలి. ప్రాజెక్ట్ ప్రదర్శనలు, నమూనాలు అవవసరం లేదు. కేవలం పరిశోధించిన అంశానికి చెందిన ఫొటోలు, మ్యాప్‌లు, గ్రాఫ్‌లు, రిపోర్టులు, సంబంధిత అధికారుల అభిప్రాయాలు, వారి ధ్రువీకరణతో రిపోర్టులు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇలా..
సంబధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీ లోపు విద్యార్ధులు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఒక జట్టుకు ఇద్దరు విద్యార్థులుండాలి. వీరిలో ఒకరిని గ్రూప్ లీడర్‌గా, మరొకరిని గ్రూప్ మెంబరుగా నమోదు చేసుకోవాలి. పాఠశాలల నుంచి ఎన్ని బృందాలైనా పాల్గొనవచ్చు. ఆరు నుంచి ఇంటర్ చదువుతున్న 10 నుంచి 17 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులు. రెండు గ్రూపులుగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి. 10 నుంచి 14 ఏళ్ల విద్యార్థులను జూనియర్ గ్రూప్‌గా, 14 నుంచి 17 ఏళ్ల విద్యార్థులు సీనియర్ గ్రూప్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసిన ప్రాజెక్ట్‌లకు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో 200 మార్కులు ఉంటాయి. వాటిలో రాతపూర్వక రిపోర్టుకు 100, ఓరల్ ప్రజెంటేషన్‌కు 100 మార్కులు కేటాయించారు. జాతీయస్థాయి పోటీల్లో ఓరల్ ప్రజెంటేషన్‌కు 50, రాతపూర్వక రిపోర్టుకు 40, పోస్టర్ ప్రజెంటేషన్‌కు 10 పాయింట్లు కేటాయించారు.
పోటీల షెడ్యూల్ ఇలా
జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం సెప్టెంబరు, అక్టోబరుల్లో నిర్వహిస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారికి డిసెంబరులో రాష్ట్రస్థాయిలో పాల్లొనే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఉత్తమంగా నిలిచిన విద్యార్ధులు వచ్చే ఏడాది జనవరి తరరువాత జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. జాతీయస్థాయిలో పోటీల విజేతలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు.
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ విద్యార్థుల మేథస్సుకు ఉపయోగపడుతోంది. ఇక్కడ ప్రతిభ చూపిన బాలలకు జాతీయ స్థాయిలో బాల శాస్త్రవేత్తలుగా గుర్తింపు లభిస్తుంది. జిల్లాలో ఉన్నత, ప్రాథమికోన్నత విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా ఆయా సైన్స్ ఉపాధ్యాయులచే కృషి చేస్తున్నాము. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు జూనియర్, సీనియర్ గ్రూపులుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
– మల్లుల శ్రీనివాస్, జిల్లా సమన్వయకర్త, ఎన్‌సీఎస్సీ


