22 నుంచి పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

22 నుంచి పవిత్రోత్సవాలు

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

22 నుంచి పవిత్రోత్సవాలు 28న మెగా జాబ్‌మేళా టీడీపీ నాయకులపై కేసు పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి జాతీయ రహదారిపై వ్యాన్‌ దగ్ధం

ఆగిరిపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వార్ల ఆలయ పవిత్రోత్సవాలను ఈనెల 22 నుంచి 25 వరకు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సాయి తెలిపారు. 22న అంకురార్పణ, 23న సర్వదేవత ఆహ్వానం, పవిత్రముల ధాన్యాధివాసము, 24న నవ కుంభారాధన, శాంతి హోమం, 25న పవిత్రములు విసర్జన, పూర్ణాహుతి, స్వామివారికి శాంతి కల్యాణం, గరుడోత్సవం జరుగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి విజ్ఞప్తి చేశారు.

పెంటపాడు: స్థానిక డీఆర్‌ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కోలా శ్రీమన్నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో ప్రముఖమైన 10 కంపెనీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

నూజివీడు: మహిళా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకుడు, కార్యకర్తలపై బుధవారం రాత్రి నూజివీడు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం మండలంలోని సిద్ధార్ధనగర్‌లో ఈనెల 12న బాల్యవివాహం జరుగుతున్న విషయం చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మహిళా పోలీసులకు, ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించింది. దీంతో మహిళా పోలీసుతో పాటు అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజరు, పోలీసు కానిస్టేబుళ్లు బాల్య వివాహం జరుగుతున్న ఇంటి వద్దకు వెళ్లి వివాహాన్ని నిలిపి వేయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు షేక్‌ సుల్తానాబేగంపై టీడీపీ నాయకులు దుర్భాషలాడగా ఆమె రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన టీడీపీ ఎస్టీ నాయకుడు బాణావతు బద్రునాయక్‌తో పాటు భూక్య శ్రీనివాసరావు, లాకావతు తిరుమలేశు, మన్నే రమేష్‌, యాదల శ్రీనివాసరావు, యాదల లక్ష్మీనారాయణలపై రూరల్‌ ఏఎస్సై నాయక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెనుగొండ: ప్రభుత్వానికి వారధులుగా పనిచేసే ఉద్యోగులు ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీఈవో పి జగదాంబ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అనంతరం పలువురు ఎంపీడీవోలకు ఫోన్‌ ద్వారా ఆమె పలు సూచనలు చేశారు. రానున్న గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. సిటిజెన్‌ ఈకేవైసీ, వాట్సప్‌ మనమిత్రా సర్వేలు, సచివాలయ సేవలు అందించే విధానంపై పలు సూచనలు చేశారు. సచివాలయాలకు వచ్చిన ప్రజానీకానికి మనమిత్ర సేవలపై అవగాహన కల్పించాలని వివరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పెనుగొండ ఎంపీడీవో టి.సూర్యనారాయణ మూర్తి డిప్యూటీ ఎంపీడీవోలు ఒ సూర్యప్రకాశరావు, ఎ.మల్లేశ్వరరావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. బట్టలు, పార్సిళ్లు దగ్ధం

ద్వారకాతిరుమల: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు చెలరేగిన ఘటన మండలంలోని లక్ష్మీనగర్‌ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో తరలిస్తున్న బట్టలు, పార్సిళ్లు కాలిపోయాయి. అలాగే డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే. ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వైపు బట్టల లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్‌ను లక్ష్మీనగర్‌ వద్ద రాత్రి 11.15 గంటల సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వ్యాన్‌లోని బట్టలు, పార్సిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన మంగళూరుకు చెందిన డ్రైవర్‌ షాహిద్‌ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement