మద్దిలో డిజిటల్‌ సేవలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మద్దిలో డిజిటల్‌ సేవలు ప్రారంభం

Aug 21 2026 7:39 AM | Updated on Aug 21 2026 7:39 AM

జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో నూతన డిజిటల్‌ సేవలను గురువారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ ప్రారంభించారు. తొలుత ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మద్ది చెట్టు సంరక్షణకు వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ దృష్ట్యా స్థల సేకరణ, మాస్టర్‌ ప్లాన్‌ పనులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు – జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుంచి ఆలయ రాజగోపురం వరకు ఉన్న రహదారికి ఇరువైపులా సుమారు 8 అడుగుల ప్రైవేటు స్థలాన్ని యజమానుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. ఆ ప్రదేశంలో భక్తులు ఎండ, వానల నుంచి రక్షణ పొందేలా నీడ నిచ్చే షెడ్లు నిర్మించాలని పేర్కొన్నారు. అలాగే ఆలయం ముందు భాగంలో ఉన్న వ్యాపార సముదాయాలు, షాపులను తొలగించి, వాటిని వెనుక ఉన్న పార్కింగ్‌ స్థలంలోకి మార్చాలని ఆదేశించారు. రూ.1.20 కోట్ల వ్యయంతో అధునాతనంగా నిర్మించిన 8 గదుల ’శ్రీరామ సదనం’ వసతి గృహ భవనాన్ని పరిశీలించిన ఆయన, మిగిలిన చిన్నపాటి పనులను వేగంగా పూర్తి చేసి తక్షణమే భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో స్టీల్‌ బల్లల ఏర్పాటు, బాయిలర్‌ పనులను త్వరగా పూర్తి చేసి, నూతన భవనంలోనే అన్నప్రసాద వితరణ ప్రారంభించాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీ పాకశాలను, నిల్వ ఉంచే స్టోర్‌ రూమ్‌ను తనిఖీ చేసి లడ్డూ, పులిహోర నాణ్యతను రుచి చూసి పరిశీలించారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, డార్మిటరీలను తనిఖీ చేసి నిరంతరం పారిశుధ్యాన్ని నిర్వహించాలని శానిటేషన్‌ సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చారు. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్‌ కియోస్క్‌ యంత్రాన్ని, ’మన మిత్ర’ వాట్సాప్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ టికెటింగ్‌, బుకింగ్‌ విధానాన్ని ప్రజలకు వినియోగించుకోవాలన్నారు. తొలుత కమిషనర్‌కు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజన సత్యనారాయణ, ధర్మకర్తలు, అర్చక బృందం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ తనిఖీదారు వి.సురేష్‌ కుమార్‌, ధర్మకర్తల మండలి సభ్యులు చింతపల్లి రత్న సురేష్‌, దూళిపాళ ప్రభాకరరావు, తిరుమలశెట్టి నాగవర లక్ష్మి అనీల, వల్లూరి సునీత, లయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement