వేలేరుపాడు మండలం ఎర్రబోరు గ్రామానికి చెందిన మడకం సీతమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాట్కూరుగొమ్ము రెవెన్యూ పరిధిలో ఆమె భర్త మడకం రాజయ్య పేరిట ఉన్న 3.79 ఎకరాల భూమికి అవార్డు పాస్ అయింది. దీనికి బదులుగా రాసన్నగూడెం రెవెన్యూ సర్వే నంబర్ 54/1ఇ1లో 1.13 ఎకరాలు, 55/1లో 1.50 ఎకరాలు, 54/1ఇ5లో 1.10 ఎకరాలు.. మొత్తం 3.79 ఎకరాలను 2017లో కేటాయించి హక్కు పత్రం అందజేశారు. రాజయ్య మృతి చెందడంతో ఆ పట్టాను భార్య మడకం సీతమ్మ పేరిట నమోదు చేశారు. అయితే, ఆ భూమిని మరొకరు సాగు చేసుకుంటున్నా, అధికారులు సీతమ్మకు అప్పగించడం లేదు. గత ఎనిమిదేళ్లుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, కేఆర్‌పురం ఐటీడీఏ పీఓ కార్యాలయం, జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో, తన బ్రతుకులో న్యాయం జరిగేలా లేదని సీతమ్మ కన్నీరుమున్నీరవుతోంది. వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగి ప్రాణాలు వదలాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి ఈ బాధిత గిరిజనులకు తగిన భూమిని అప్పగించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.


